అందాల సొరంగం ఈ ఉప్పుగని - MicTv.in - Telugu News
mictv telugu

అందాల సొరంగం ఈ ఉప్పుగని

February 12, 2018

ఉక్రెయిన్‌లో 125 మైళ్ళ ఉప్పుగని వుంది. ఇదిప్పుడు చాలా మంది పర్యాటకులను అలరిస్తోంది. ఈ ఉప్పు గనిలో కళ్లు మిరుమిట్లు గొలిపే అందాలున్నాయి. పైనా,కిందా, గోడలు ఎటు చూసినా ఉప్పే కనిపిస్తుంది. ఆ ఉప్పులో అద్భుతమైన చిత్రాలు చెక్కారు. అందమైన గనిగా తీర్చిదిద్దారు.పైగా దానిలో బోలెడు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.  అక్కడెన్నో అద్బుతమైన శిల్పాలుంటాయి. విచిత్రమైన దారులుంటాయి.  అక్కడ ఫుట్‌బాల్ మైదానం కూడా ఉంది. భూమి లోపల అద్భుతంగా ఈ గని రికార్డ్ నెలకొల్పింది.  ఇక్కడ ఉప్పు నిక్షేపాలు ఉన్నట్లు 19వ శతాబ్దంలోనే గుర్తించారు. దాదాపుగా వందేళ్లు దీని నుంచి ముడి ఉప్పును బయటకు తీశారు. తర్వాత దీనిలో లవణం తక్కువైపోవడంతో మైనింగ్‌ పనులు నిలిపేశారు. ఇప్పుడిలా పర్యాటక గనిగా మార్చేశారు.ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ఉప్పు  గని పేరు ‘ సోలెదార్‌ సాల్ట్‌మైన్‌ ’. సోలెదార్‌ అనేది రష్యన్‌ పదం. ఆంగ్లంలో దానర్థం ‘ గిఫ్ట్‌ ఆఫ్‌ సాల్ట్‌ ’. దీనిలోపల వేరు వేరు దారుల్ని కలుపుతూ చాలానే సొరంగాలుంటాయి. ఈ అందాల గనిలో ఓ సినిమానీ  కూడా చిత్రీకరణ చేశారు. కొన్ని గోడలపై అపురూపమైన శిల్పాలు దర్శనమిస్తాయి. దీనిలోకి వెళ్లగానే చిత్రమైన అలలు అలలుగా ఉన్న గోడలు దర్శనమిస్తాయి. అక్కడక్కడా తెల్లటి ఉప్పు పొరలు, మధ్య మధ్యలో నల్లని రాతిచారలతో భలేగా కనిపిస్తాయి. .ప్రత్యేక సందర్భాలప్పుడు దీనిలోనే హాట్‌ ఎయిర్‌ బెలూన్లనూ ఎగరేస్తారు. అంటే దీని పైకప్పు అంత ఎత్తుకు ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకచోట ఉప్పు రాతితో తీర్చిదిద్దిన ప్రతిమలు కనువిందు చేస్తాయి. మరోచోటున్న సాకర్‌ స్టేడియం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. అంతేకాకుండా భూమి అంతర్భాగంలో ఉన్న   దీనిలో ఓ చర్చి కూడా ఉంది.ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే ఇప్పుడు దీన్ని చూసేందుకు బోలెడు మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్లకోసం దీనిలోనే కేఫ్‌లు, దుకాణాలూ వెలిశాయి.