కక్షతో కాల్‌గర్ల్‌ను చేశాడు.. కటకటాల వెనక్కి వెళ్లాడు! - MicTv.in - Telugu News
mictv telugu

కక్షతో కాల్‌గర్ల్‌ను చేశాడు.. కటకటాల వెనక్కి వెళ్లాడు!

December 6, 2017

తను ప్రేమించిన అమ్మాయి తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుందని కక్ష గట్టాడు ఓ ప్రబుద్ధుడు. ప్రేమించే హృదయం త్యాగాన్ని కోరుకుంటుంది కానీ ఇతని హృదయం పగని కోరుకున్నది. ఎలాగైనా ఆ అమ్మాయిని బజారుకీడ్చాలని పథకం పన్నాడు. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  కర్నూలు జిల్లాకు చెందిన సందీప్‌ కుమార్‌ గుప్తా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ప్రేమించాడు. ఆమె అతణ్ణి కాదని తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంది.  సందీప్‌  అహం దెబ్బతిని రగిలిపోయాడు. తనను కాదని ఇంకొకరిని ఎలా పెళ్ళాడుతుందని పగబట్టాడు. ఫేస్‌బుక్‌లో ఆమె పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆమె ఫోటోలే ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. అంతటితో ఆగకుండా బ్లాగ్ స్పాట్, లొకాంటో తదితర వెబ్‌సైట్లలో సైతం ఆమె పేర ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆమెను కాల్‌గర్ల్ అని చెబుతూ ఆమె ఫోన్ నంబర్ కూడా పెట్టాడు.

ఆమెను వేశ్యగా ప్రచారం చేసి,  ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాడు. దీంతో ఆమెకు  అసభ్య కాల్స్ రావడం మొదలైంది. చిర్రెత్తుకొచ్చిన ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ, కాల్‌డేటా ఆధారంతో సందీప్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రహస్యంగా తన మాజీ ప్రియురాలి సంతోషాన్ని చిదిమేద్దామనుకున్న ప్రియుడు సందీప్ కటకటాల పాలయ్యాడు.