6 గంటల్లో కట్టిన బ్రిడ్జి.. కుప్పకూలి 8 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

6 గంటల్లో కట్టిన బ్రిడ్జి.. కుప్పకూలి 8 మంది మృతి

March 16, 2018

అమెరికాలోని ఫ్లోరిడాలో పాదచారుల కోసం నిర్మించిన వంతెన కూలిపోయి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ‘ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ’ యూనివర్సిటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడా యూనివర్సిటీని స్వీట్‌వాటర్‌ నగరంతో అనుసంధానం చేసే ఈ వంతెనను ఎనిమిది లేన్ల రోడ్డుపై శనివారం నాడు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు.  950 టన్నుల బరువున్న ఈ బ్రిడ్జి కింద ఉన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.కొన్ని గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గాయాలపాలైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు అంటున్నారు ఫ్లోరిడా హైవే పెట్రోలింగ్ అధికారులు.

బ్రిడ్జి కూలిన ఘటనలో ఆరు నుంచి 8 మంది వరకు మృతి చెంది ఉంటారని ఫ్లోరిడాకు చెందిన సెనేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. కాగా, తాను నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడం తమ 40 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని ఎఫ్ఐజీజీ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. బ్రిడ్జి కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తొందరపడి ఆరు గంటల వ్యవధిలో నిర్మంచడం వల్లే ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని బాధితులు అంటున్నారు.