కుల పరమైన దూషణలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. అన్ని కులాలు, వృత్తులు, వ్యక్తులు కలిసి ఐకమత్యంగా ముందుకు సాగితేనే సమాజం పురోగమిస్తుందని ఆయన పేర్కొంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ,ఆర్య వైశ్యులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు సబబు కాదని తెలిపారు. ఏ కులంలోనైనా కొన్ని లోటుపాట్లు ఉండటం సహజమని, అంత మాత్రాన మొత్తం కులాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు.
కొన్ని వర్గాలలో వున్న వెనుకబాటుతనాన్ని మరో వర్గానికి ఆపాదించడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్య వైశ్యులను కుల పరంగా దూషించడం ఏమాత్రం సంస్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
తరతాలుగా వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్న అట్టడుగు వర్గాలకు మేలు చేయాలంటే వారిలో చైతన్యం తేవడానికి కృషి చేయాలే కానీ ఎవరినో దూషించడం వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు బాగు పడతారనుకోవడం సబబు కాదన్న అభిప్రాయాన్ని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వ్యక్తం చేశారు.