సెల్‌ఫోన్ లైట్ వెలుగులో ఓ రోగికి డాక్టర్లు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. అత్యంత విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో ఒక్క ఎల్ఈడీ బల్బు కూడా లేదు.
ఓ రోగికి వైద్యుడు అత్యవసర శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఆయనకు ఎదురుగా ఉన్న మరో వైద్యుడు, సెల్‌ఫోన్ లైట్ చూపిస్తున్నారు. ఆ లైట్ వెలుగులోనే వారంతా ఆపరేషన్ పూర్తి చేశారు. గత మూడునెలలుగా ఆపరేషన్ థియేటర్లో గుడ్డి వెలుతురులోనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో ఇదే ఆసుపత్రిలో ఓ చంటిబిడ్డను ఎలుకలు కొరికి చంపేశాయి. ఆ ఘటన మరువక ముందే ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలిసిన రోగులు ఆ ఆసుపత్రికి వెళ్ళాలంటే జంకే పరిస్థితి నెలకొంది. కాగా జీజీహెచ్‌కు ఎన్ఏబీహెచ్ గుర్తింపు తీసుకువస్తామని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. దాని కోసం వందల కోట్లు నిధుల ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ ఏవీ కార్యరూపం దాల్చటం లేదంటున్నారు. దీనిపై సూపరింటెండెంట్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వందల సార్లు ఫిర్యాదులు చేసినా, లేఖలు రాసినా ఫలితం లేదని వైద్యులు వాపోతున్నారు.