పెట్రో ధరలను తగ్గించే ఐడియా ఇదే! - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రో ధరలను తగ్గించే ఐడియా ఇదే!

December 9, 2017

పెరుగుతున్న పెట్రోల్ ధరలను అదుపు చేయటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ. అయితే పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువెళితేనే ధరలు అదుపు అవుతాయన్న డిమాండ్లను తోసి పుచ్చుతూ ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది కేంద్రం.

ఈ విధానం కింద పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలపనున్నట్లు వెల్లడించారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా విధానాన్ని ప్రకటించనున్నట్టు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చెప్పారు. మిథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా ధర తగ్గించడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

మిథనాల్‌తో నడిచే ప్రత్యేక ఇంజిన్‌ను ప్రముఖ కంపెనీ వోల్వో తీసుకొచ్చిందని, అదే ఇంధనంతో నడిచే 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కరీ తెలిపారు. బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే  లీటర్ మిథనాల్‌కు రూ. 22 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రూ.80గా ఉన్న పెట్రోల్‌ ధరను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. చైనా మాత్రం లీటర్ మిథనాల్‌ను తయారు చేయటానికి రూ. 17 మాత్రమే ఖర్చు చేస్తున్నదన్నారు. అలాగే ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. పెద్ద ఎత్తున చమురు, శుద్ధి కర్మాగారాలను నెలకొల్పడం కన్నా దీనిపై దృష్ఠి సారించాలని తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు తెలిపారు.

అలాగే నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటానికి ముమ్మరంగా కృషి చేస్తున్నామన్నారు.  ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, దాన్ని 40 కిలోమీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.