చిరుతపులిని నరికి చంపిన మన్యంపులి - MicTv.in - Telugu News
mictv telugu

చిరుతపులిని నరికి చంపిన మన్యంపులి

February 19, 2018

ప్రాణాల మీదకు వచ్చినప్పుడు తన ధైర్యమే తనకు శ్రీరామరక్ష అవుతుందంటారు. అది అక్షరాలా నిజమని ఈ ఘటన నిరూపిస్తోంది. తాను మచ్చిక చేసుకుంటున్న ఆవులపై ఓ చిరుత దాడికి దిగింది. వాటిని చంపి తిందామన్నంత కసిలో వుందా క్రూరమృగం. అక్కడే వున్న ఆవుల యజమాని ‘అమ్మో పులి ’ అని తోక ముడవలేదు. వాటి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి చిరుతతో పోట్లాటకు దిగాడు. అది విసిరే పంజాల నుండి తప్పించుకుంటూ, చివరికి చాలా తెలివిగా తన దగ్గరున్న వేటకొడవలితో  దాన్ని నరికి చంపేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న  తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా  మహారాజ కడై గ్రామం వద్ద  జరిగింది.ఆదివారం అడవిలో మేత మేస్తున్న పాడి ఆవులపై చిరుత పులి దాడి చేసింది. అదే సమయంలో ఆవులకు కాపలా ఉంటున్న 62 ఏళ్ల రామమూర్తి అనే రైతు ఏ మాత్రం భయపడకుండా చిరుతపై దాడి చేశాడు. తన వద్ద ఉన్న వేటకొడవలితో  చిరుతను నరికాడు. ఈ ఘటనలో కృష్ణమూర్తికి స్వల్ప గాయాలు కాగా, చిరుత చనిపోయింది.

ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ రామమూర్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. కాగా ముదిమ వయసులో కృష్ణమూర్తి చూపిన తెగువను స్థానికులు హర్షిస్తున్నారు. ‘మన్యంపులి’ సినిమాలో హీరో మోహన్ లాల్ పులులను చంపినట్లే  రామమూర్తి కూడా  చిరుతను మట్టుబెట్టాడని కుర్రకారు కామెంట్లు చేస్తోంది.