పసివాడి కోరిక తీరింది..  - MicTv.in - Telugu News
mictv telugu

పసివాడి కోరిక తీరింది.. 

April 5, 2018

‘సిగరెట్లు కాల్చేవాళ్లను, పొగాకు నమిలేవాళ్లను జైల్లో పడేస్తాను.. అమ్మాయిల్ని ఏడిపించేవాళ్ల తాట తీస్తాను’ అన్నారు బుల్లి పోలీస్ కమిషనర్. గుట్కా, పాన్ మసాలాలు నమిలి, సిగరెట్టు తాగే వ్యసనకారులు, పోకిరీలు అందరూ తస్మాత్ జాగ్రత్త. హెచ్చరిక బాగానే వుంది కానీ ఈ బుల్లి కమిషనర్ ఏంటని ఆశ్చర్యపోకండి. అవును అతను బుల్లి కమిషనరే.. పైగా ఒకరోజు కమిషనరు. ఒకరోజు సీఎంగా వుండే ‘ నాయకుడు ’ సినిమా గుర్తొచ్చింది కదూ. మీరు ఇంకా తికమక పడాల్సిన అవసరం లేకుండా వివరాల్లోకి వెళితే.. రాచకొండ కమిషనరేట్‌కు బుల్లి కమిషనర్‌గా ఒకరోజు బాధ్యతలు నిర్వహించిన ఆ బుల్లెబ్బాయి పేరు ఇషాన్.ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌తో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారి ఆఖరి కోరిక తీర్చేందుకు పోలీసులు ఈ విధంగా ముందుకొచ్చారు. ఒక్కరోజు కమిషనర్‌గా అవకాశం ఇచ్చారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఇషాన్ కోరిక నెరవేరింది. మెదక్ జిల్లా కుంచన్‌పల్లికి చెందిన పెయింటర్ చాంద్‌పాషాకు ముగ్గురు పిల్లలు. వారిలో రెండో కొడుకైన ఇషాన్ రెండో తరగతి చదువుతున్నాడు. మూడు నెలల క్రితం అతడు అనారోగ్యం పాలవ్వగా… పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్లడ్ కేన్సర్ అని తేల్చారు. దీంతో తమ కొడుకు కోరిక గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు మేక్ ఏ విష్ ఫౌండేషన్‌ను సంప్రదించగా ఇది సాధ్యమయింది. ఒక్క రోజు సీపీగా తన కోరికను తీర్చిన మహష్ భగవత్‌కు కృతజ్ఞ‌తలు తెలిపాడు ఇషాన్. పసివాడి కోరికను తీర్చిన పోలీసులను చాలా మంది అభినందిస్తున్నారు.