ఒక రూపాయి కోసం లొల్లి.. నిండుప్రాణం బలి - MicTv.in - Telugu News
mictv telugu

ఒక రూపాయి కోసం లొల్లి.. నిండుప్రాణం బలి

February 3, 2018

కేవలం రూపాయి కోసం ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. కల్యాణ్‌కు చెందిన మనోహర్ గమ్నే ( 54 ) కోడిగుడ్లు కొనడానికి పక్కనే వున్న కిరాణ షాపులోకి వెళ్లాడు. గుడ్ల ధర కంటే రూపాయి మాత్రమే తక్కువ చెల్లించాడు గమ్నే. రూపాయి ఎలా తక్కువిస్తావని సదరు దుకాణ దారుడు గమ్నేతో వాదులాటకు దిగాడు. పెద్దమనిషి అని కూడా చూడకుండా అమర్యాదగా దుర్భాషలాడాడు. బాధతో ఇంటికి వెళ్లిన గమ్నే జరిగిన విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పాడు.తండ్రిని తిట్టాడనే ఆవేశంతో గమ్నే కొడుకు తండ్రిని తీసుకొని కిరాణ షాపుకు వెళ్ళాడు. ‘ పిచ్చకుంట్ల రూపాయి కోసం మా నాన్నను తిడతావా ? ’ అంటూ కిరాణ షాపతణ్ణి నిలదీశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఆవేశానికి గురైన దుకాణదారుడి కుమారుడు గమ్నేపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దెబ్బలకు తాళలేక గమ్నే అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.