కాలనీవాళ్లు ఆమెను చదివిస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

కాలనీవాళ్లు ఆమెను చదివిస్తున్నారు

November 2, 2017

‘ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనందించే చేతులే మిన్ ’ అని చాటారు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ వాసులు. పక్కోడు ఎటుపోతే మనకేంటీ.. మనం సేఫ్‌జోన్‌లో వున్నామా లేదా అనుకునే మనుషులకు కనువిప్పు కలిగించారు. ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన కాజల్ ఝా( 17 ) అనే అమ్మాయి ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత చదువు ఆపేసింది. ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించినా పేదరికం కారణంగా అర్ధంతరంగా చదువు మానేసింది. కాజల్ చదువులో చాలా ప్రతిభావంతురాలు. స్కూళ్ళో, కాలేజీలో అధ్యాపకులకు అత్యంత ఇష్టమైన విద్యార్థిని. ఐఐటీ చదవాలన్నది ఆమె కోరిక. అయితే  పేదరికం కారణంగా అడుగు ముందుకు వెయ్యలేకపోయింది. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఒక దశలో కుటుంబం మొత్తం ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నారు. అయితే కాజల్ చదువు ఆగిపోయిందనే విషయాన్ని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. మనకెందుకులే అనుకోకుండా ఆమె చదువు ఆగిపోవడానికి గల కారణాన్ని తెలుసుకున్నారు. మానవతా హృదయంతో కాలనీ వాసులంతా ఏకమయ్యారు.

ఏం చేస్తే ఆ పాప చదువు ముందుకు వెళుతుందని ఆలోచించారు. తలా ఒక చెయ్యి వేశారు.

క్రౌడ్ ఫండింగ్ చేసి కాజల్‌ను ఐఐటీ కోచింగ్ సెంటర్‌లో తొలుత రూ. 20,000 కట్టి జాయిన్ చేయించారు. మెల్లగా ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం జోరందుకున్నది. అలా మరో 40 కుటుంబాలు కాజల్ చదువుకి అండగా వుంటామని ముందుకొచ్చారు. అంతేకాదు తాకట్టులో ఉన్న కాజల్ వాళ్ల ఇంటిని విడిపించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మధ్యలోనే చదువు ఆపేసిన కాజల్ సోదరుడి చదువుని కూడా కొనసాగిస్తున్నారు. ఆమె తండ్రిని ఒక కంపెనీలో సూపర్ వైజర్ ఉద్యోగంలో చేర్పించారు. ఎవరికెవరు ఏమీ కాని ఈ సమాజంలో మేమున్నామని ముందుకొచ్చి ఒక కుటుంబానికి అండగా నిలిచిని ఇందిరాపురం కాలనీవాసులను సోషల్ మీడియాలో శతకోటి వందనాలు సమర్పిస్తున్నారు నెటిజనులు.