కేసీఆర్‌ ఫ్రంట్‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌ ఫ్రంట్‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది

March 15, 2018

ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ ఋణం తీర్చుకున్నారని, భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతమాత ఋణం కూడా తీర్చుకుంటారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

 ‘ గుజరాత్ సీఎంగా మోదీ తన నమూనా పేరుతో ఎలా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారో.. తెలంగాణ చరిష్మాతో సీఎం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలకు వెళతారు. కేసీఆర్ ఎజెండానే జాతీయ ఎజెండా కానుంది. సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే కేసీఆర్ ఎజెండాగా ఉంటుంది.పది పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నం మేమెప్పటికీ చేయం. యూపీ, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు ‌కేసీఆర్ ఆలోచన ధోరణిని ప్రజలు సమర్ధిస్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలు పట్టించుకొనే పరిస్ధితి లేరు. కాంగ్రెస్ నాయకులది కేవలం అధికార ఆరాటమేనన్న సంగతి ప్రజలకు తెలిసిపోయింది.  ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే అధికారం కోసం కాంగ్రెస్ అనవసరపు రాద్దాంతం చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఇకఫై నమ్మే స్థితిలో లేరు’ అన్నారు కేటీఆర్.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ,కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని.. యూపీలో సమాజ్‌వాది పార్టీ గెలుపుతో ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైందన్నారు. హరీశ్‌రావు ప్రజల ఆశయాల కోసమే ఆనాడు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు.