కొత్త  కాపురాన్ని కూల్చేసిన డైటింగ్! - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త  కాపురాన్ని కూల్చేసిన డైటింగ్!

December 5, 2017

పెళ్ళయ్యాక నెల రోజులే ఆ దంపతులు కాపురం చేశారు. కానీ డైటింగ్ గొడవతో మొహాలు తిప్పుకున్నారు. పచ్చగడ్డి, ఆకులు అలములు తినే భార్యతో తాను వేగలేనని, తనకు విడాకులు ఇప్పించాని భర్త  కోర్టును ఆశ్రయించాడు భర్త. భార్య కూడా తనకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదని, బలవంతంగా పెళ్లి చేసుకున్నానని చెప్పింది.

కోర్టు వారికి కౌన్సెలింగ్‌లు గట్రా పెట్టకుండా వెంటనే విడాకులు మంజూరు చేసింది. ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకున్నది.  ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. అయితే యువతి కాస్త లావుగా ఉందని వివాహానికి అతను నిరాకరించగా, అతని తల్లి ఒప్పించి నెల రోజుల క్రితం వివాహం జరిపించింది.

భర్త తనను లావుగా వున్నావని అన్నాడని ఎలాగైనా బరువు తగ్గి మల్లెతీగలా మారాలనుకున్నది. అందుకు తగ్గ డైట్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. ఇదంతా తాను తినడమే గాకుండా ఇంటిల్లిపాదికీ అవే పచ్చి కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా పెట్టేది.

ఇలాంటివి తమకు పడవు.. అమ్మకు నాకు వండిపెట్టు అని భర్త అంటే.. నేనిలాగే పెడతాను ఇష్టముంటే తినండి, లేదా మానేయండి అని తెగేసి సమాధానాలు చెప్పేదట. అంతటితో ఆగకుండా తనలా ఆకులూ అలములు తినకపోతే భర్త, అత్త అని కూడా చూడకుండా వారిని కొట్టేదట. కోడలు కొట్టిన దెబ్బలకు పెద్ద మనిషి అయిన అత్త చేయి విరిగిపోవడం గమనార్హం.

అలా ఇంట్లో రోజూ ఏదో  ఒక రభస సృష్ఠించనిది ఆ ఇల్లాలికి మనసున పట్టేది కాదు. భర్తతో వేరు కాపురం పెడదామని పోరేదని భర్త వాపోయాడు. ఆమె వేధింపులకు తాళలేక విడాకుల కోసం బెంగుళూరు కోర్టును ఆశ్రయించినట్టు తెలిపాడు. కేసు విచారణ నిమిత్తం కోర్టు భార్య అభిప్రాయం కోరింది. అందుకు ఆమె కూడా తనకిది ఇష్టం లేని పెళ్ళి అని.. మా ఇంట్లోవాళ్ల బలవంతం మీద ఈ పెళ్లి చేసుకొన్నానని చెప్పింది. తనకూ విడాకులు కావాలని కోరింది. విడాకుల కేసుల్లో కోర్టు చాలా మటుకు ఇద్దరకీ ఆరు నెలల కౌన్సెలింగ్, పరిశీలన వంటివి విధిస్తుంది. కానీ వీరి విషయంలో కోర్టు అవేవీ పట్టించుకోకుండా వెంటనే విడాకులు మంజూరు చేసింది.