దళితులకు సమాజం, ప్రభుత్వం అండగా నిలబడాలి - MicTv.in - Telugu News
mictv telugu

దళితులకు సమాజం, ప్రభుత్వం అండగా నిలబడాలి

April 3, 2018

దళితులకు కల్పించిన హక్కులు, తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైననే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులను తెలంగాణ కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా, తమ రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు ఎంతో వెనకబడి వున్నారు. కావున వారిని ప్రభుత్వాలు, సమాజం అన్నీ విధాలుగా అర్థం చేసుకొని అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా వుందని అన్నారు. దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయ స్థానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అణిచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని, భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు.  తమ హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని చెప్పారు.

ఈ విషయమై ప్రధాని మోదీ వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయస్థానానికి చెప్పాలని ప్రధానిని కోరారు.