మృగాడి దుమ్ము దులిపిన సాహస అమ్మాయి - MicTv.in - Telugu News
mictv telugu

మృగాడి దుమ్ము దులిపిన సాహస అమ్మాయి

December 14, 2017

అమ్మాయంటే అణకువగా వుండాలి.. చేతులకు గాజులు తొడుక్కోవాలి.. కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవాలి.. చీర నిండుగా కట్టుకోవాలి.. నడిరోడ్డులో ఒక మగాడు తనమీద అత్యాచారానికి పాల్పడుతున్నా, యాసిడ్ దాడికి ఒడిగడుతున్నా చేతులు ముడుచుకొని మౌనంగా వుండాలి, దాడులు జరిగాక జీవితాంతం కుమిలి కుమిలి చావాలి.., వంటి తొక్కా తోటకూర వంటి మగపురాణాలకి చెంప పెట్టు సమాధానం చెప్పింది ఈ యువతి. అది కూడా చెప్పుతో చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది. ఇప్పుడు ఈమె ధైర్యం ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి పనిమీద ఇద్దరు యువతులు వెళ్ళారు.

అక్కడికొచ్చిన ఓ తాగుబోతు మద్యం మత్తులో అమ్మాయిలే కదా అని వారిమీద చెయ్యేసాడు. అసభ్యంగా తాకబోయాడు. వాడి చర్యలకు వాళ్ళు భయపడి ఇతరులు సాయం అర్థించలేదు. వెంటనే తన చున్నీని నడుముకు చుట్టుకుంది ఆ అమ్మాయి. భద్రకాళిలా వాడి మీద దుంకింది. ఛడామడా దుమ్ము దులిపింది. గల్లా పట్టుకొని ఈడ్చి ఈడ్చి కొట్టింది, కసితీరా తన్నింది. చెప్పు తీసి దవడలు సాఫ్ చేసింది. ‘ ఇంట్లో నీ అమ్మను, చెల్లెను కూడా ఇలాగే తాకుపోరా వెధవ ’ అంటూ రోడ్డు మీద బోర్లిస్తూ పొట్టు పొట్టు కొట్టింది. దెబ్బకు అయ్యవారి రిమ్మ దిగిపోయి అమ్మాయిలో అమ్మోరు కనిపించి, దెబ్బకు అక్కడి నుండి తుర్రుమందామనుకున్నాడు.కానీ ఆ అమ్మాయి వాన్ని  వదలకుండా  పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పింది. ఆమె తెగువ చూసి అక్కడున్న వారంతా ప్రశంసించకుండా వుండలేకపోయారు. ‘ ఇదీ అమ్మాయిల సత్తా అంటే.. ఇలా ప్రతీ అమ్మాయి తన మీదకొచ్చే మృగాణ్ణి నిలువరిస్తే దేశంలో మహిళల పట్ల దాడులు, అఘాయిత్యాలు జరగనే జరగవు.. శభాష్.. ’ అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘ సాహస బాలలు ’ అంటూ అవార్డులిచ్చే ప్రభుత్వం ఈ అమ్మాయి తెగువ చూసి ‘ సాహస అమ్మాయిలు ’ అని ఈసారి నుండి అవార్డులు ఇస్తే ఎంతో బాగుంటుందంటున్నారు. అలా చేస్తేనైనా అమ్మాయిల్లో దాగివున్న తమ శక్తి సామర్థ్యాల గురించి తెలుస్తుందంటున్నారు. దేశంలో అమ్మాయిలు, మహిళలు, పసి పిల్లల పట్ల జరుగుతున్న దారుణాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.