అంబానీల విమానంలో రానున్న శ్రీదేవి భౌతిక కాయం - MicTv.in - Telugu News
mictv telugu

అంబానీల విమానంలో రానున్న శ్రీదేవి భౌతిక కాయం

February 26, 2018

శ్రీదేవి కడచూపు భాగ్యం కోసం ఆమె అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో పార్థివదేహం దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్‌ విమానంలో తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో శ్రీదేవికి పోస్ట్‌మార్టం మొదలవగానే ముంబై నుంచి అంబానీ విమానం దుబాయ్ బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం ( ఎంబ్రార్‌-135బీజే ) రిలయన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రావెల్‌ లిమిటెడ్‌కు చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది.

బోనీకపూర్ మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తియింది.  అక్కడి దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికకాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నంలోగా ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. శ్రీదేవి పార్థివదేహాన్ని తొలుత ఆమె ఇంటికే తరలిస్తారు. అక్కడ అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం వుంచుతారు. తర్వాత మెహబూబా స్టూడియోకు తీసుకెళ్తారు. అక్కడినుండి జుహూలోని శాంతాక్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.