రక్షణ మంత్రీ.. ఆ నిబంధనలేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

రక్షణ మంత్రీ.. ఆ నిబంధనలేంటి?

December 6, 2017

దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చును నెలకు రూ.10 వేలకు కేంద్రం పరిమితం చేసింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది ఆరంభంలో ఈ పరిమితిని కేంద్రం విధించింది. రక్షణ శాఖ నిర్ణయం దాదాపు 3,400 చిన్నారుల భవిష్యత్‌పై ప్రభావం చూపించనుంది. ఈ విషయమై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నేవీ చీఫ్‌ ఆడ్మిరల్‌ సునీల్‌ లంబా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘ సైనికులు మనకోసం తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడుతున్నారు. అలాంటి వీర సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చుపై పరిమితి విధించడం సరికాదు. వారి కుటుంబాలకు అందించే సాయం వారికి భరోసాను కల్పిస్తుంది. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ’ లేఖలో పేర్కొన్నారు. కాగా రక్షణ శాఖ కూడా ఈ విషయంపై పరిశీలిస్తున్నట్లు, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్‌ విజయం సాధించిన అనంతరం 1971 డిసెంబర్‌ నుంచి వీరమరణం పొందిన సైనికుల పిల్లల చదువులకు కేంద్రం నుంచి ఆర్థికసాయం అందుతున్న విషయం విదితమే. అమర సైనిక కుటుంబాలకు చేస్తున్న మంచి పనికి ఆంక్షలు సరికావని రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా  నిర్మలా సీతారమన్‌కు లేఖ రాశారు. ‘ సైనికుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. వారి కుటుంబసభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే నైతిక బాధ్యత మనపై ఉంది. వారి సంక్షేమం కోసం ఖర్చుపెట్టే నిధులపై పరిమితి విధించడం సరికాదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ‘  చంద్రశేఖర్‌ లేఖలో పేర్కొన్నారు.