వైద్యుడు భూతవైద్యం చేశాడు.. పేషెంట్ ప్రాణాలు పోయాయి - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యుడు భూతవైద్యం చేశాడు.. పేషెంట్ ప్రాణాలు పోయాయి

March 16, 2018

వైద్యానికి, భూతవైద్యానికి అస్సలు పొసగదు. తాంత్రికతకు ఫర్లాంగుల దూరంలో వుంటారు డాక్టర్లు. కానీ ఓ డాక్టర్ భూతవైద్యాన్ని నమ్మాడు. తను వైద్యం చేస్తున్న మహిళపై వైద్యంతో పాటు భూతవైద్యాన్ని ప్రయోగించాడు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన సంధ్య సోనావానే అనే మహిళ రొమ్ముపై చిన్న బొబ్బ వచ్చింది. భయపడిన ఆ మహిళ వెంటనే స్థానికంగా ఉన్న సతీష్ చవాన్ అనే డాక్టర్‌ను సంప్రదించింది. చవాన్ కొన్నిరోజులు వైద్యం చేశాడు. కానీ ఆమెకు గాయం తగ్గలేదు పైపెచ్చు గాయం మరింత పెరిగింది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆమెను దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో  ఐసీయూకి తరలించారు. ఆమెతో పాటు బంధువులు కూడా ఉన్నారు.

ఆమె ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమించడంతో డాక్టర్ చవాన్ తన వైద్యం కన్నా భూతవైద్యం బెటరనుకున్నట్టున్నాడు. మార్చి 11న తనతో పాటు ఐసీయూలోకి ఓ భూతవైద్యుణ్ణి వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ మాంత్రికుడు తనవెంట తెచ్చుకున్న ఎర్రటి సంచి తీసి, ఆమె తల నుండి కాళ్ళ వరకు తిప్పుతూ ఏవేవో మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. ఇదంతా గమనించిన ఆమె బంధువులు డాక్టర్‌ను ప్రశ్నించారట. ఇది వైద్యంలో భాగమని డాక్టర్ చెప్పాడట. ఎందుకైనా మంచిదని ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీశారు. ఈ పూజలు జరిగిన రెండు రోజులకు సంధ్య సోమవారం ఆస్పత్రిలోనే చనిపోయింది.

ఆమె శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేయకపోవడంతోనే ప్రాణాలు పోయాయని డాక్టర్లు నిర్థారించారు. చవాన్ చేతబడి చేయటం వల్లే సంధ్య చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన డాక్టర్‌ను శిక్షించాలని కోరుతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. అదికాస్తా వైరల్‌‌గా మారటంతో.. దీనిపై ఓ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. ఈ వీడియో ఆధారంగా డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగప్రవేశం చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు సంధ్యకు రొమ్ముపై బొబ్బ వచ్చినప్పుడు చవాన్ ఆమెకు వైద్యం చేశాడు. అయినా గాయం తగ్గలేదు.  ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వేరే ఆసుపత్రికి తరలించారు. తనవల్లే ఆమె ఆరోగ్యం విషమించడంతో చవాన్ తాంత్రికపూజలు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.