mictv telugu

ఇంట్లోకి దూసుకెళ్లిన తాగుబోతు కారు.. మహిళ దుర్మరణం..

January 8, 2019

చిత్తుగా మద్యం తాగిన తాగుబోతు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాడు. దీంతో ఆ ఇంటి పెద్ద దిక్కును కోల్పాయారు ఆ కుటుంబ సభ్యులు. విధులకు వెళ్లేందుకు ఇంట్లో సిద్ధమవుతున్న ఆమె మీదకు మృత్యుశకటాన్ని దూసుకుపోయాడు తాగుబోతు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

గౌలిదొడ్డి నివాసి తోల్డీ మాధు బాయికి(45)కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈమె భర్త సత్వజీ 8 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు.అప్పటినుంచి కుటుంబ భారం ఆమె మీదే పడింది. ఓ ప్రైవేటు సంస్థలో హౌస్‌కీపింగ్‌ పనిచేస్తూ మాధుబాయి ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజూవారి పనుల్లో భాగంగా  సోమవారం కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె తమ ఇంటి స్నానాల గదిలోకి వెళ్లింది. ఇంతలో వేగంగా ఓ కారు బయటినుంచి గోడను కూల్చుకుని లోపలికి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ప్రహరీ గోడ సహా స్నానాల గది గోడ కూలి తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. ఆమె మరణంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. పెద్దదిక్కును కోల్పోయినందుకు వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.

ప్రమాదం జరిగిందిలా..

టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇక్రం అలీ(26) ఆదివారం రాత్రి బార్కస్‌లో స్నేహితుల ఇంట్లో విందుకు వెళ్లాడు. అక్కడ మద్యం ఫూటుగా తాగి సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడి నుంచి తిరిగి తన కారులో ఇంటికి బయలుదేరాడు. గచ్చిబౌలీ నుంచి టోలీచౌకీ వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఇతను నానక్‌రాంగూడ వద్ద దారితప్పి గోపన్‌పల్లి వైపు వెళ్లాడు. తిరిగి గచ్చిబౌలి వైపు వస్తుండగా గౌలిదొడ్డి వద్ద అతివేగంగా కారు నడిపాడు. దీంతో కారు అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చి ముందున్న స్కూటర్‌, ఇంటి ప్రహరీ, స్నానాల గదిని ఢీకొంది. దీంతో ఇంట్లో వున్న మాధుబాయి తీవ్ర గాయాలపాలై మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు తాగుబోతు అలీని అదుపులోకి తీసుకున్నారు.