తాగుబోతు భర్త గొంతుకోసి హత్య చేసిన భార్య - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు భర్త గొంతుకోసి హత్య చేసిన భార్య

April 10, 2018

నిత్యం మద్యానికి బానిసయ్యాడు ఓ భర్త. ప్రతిరోజూ తాగి వచ్చి తనకు నరకం చూపిస్తున్నాడని భర్త గొంతు కోసి హత్య చేసింది ఓ భార్య. అత్యంత విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటన కర్ణాటకలోని దావణగిరి జిల్లా న్యామతి తాలుక అరుడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింహప్ప (45) ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భార్య రేణుకను డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు. ఆరోజు రాత్రి కూడా ఎప్పటిలానే పీకలదాకా తాగి వచ్చాడు నరసింహప్ప. మద్యం మత్తులో రేణుకను డబ్బుల కోసం వేధించాడు. ఎంత లేవన్నా మాట పట్టించుకోకుండా వేధించాడు. దీంతో భర్త ప్రవర్తనకు విసుగెత్తిపోయిన రేణుక భర్తను తుదముట్టించాలని అనుకుంది.

రాత్రిపూట నరసింహప్ప నిద్రమత్తులో వుండగా వంటగదిలోంచి కత్తిపీట తీసుకువచ్చింది. నరసింహప్ప గొంతు కోసి హత్య చేసింది. ఈ విషయం బయటకు పొక్కితే తను కటకటాలు లెక్కబెట్టవలసి వస్తుందని భావించింది. భర్త శవాన్ని బాత్‌రూంలో పూడ్చి పెట్టాలనుకుంది. బాత్‌రూంలో గోతి తీసి పాతి పెట్టింది. ఇంటి ఆవరణలో వున్న రక్తపు మరకలను కడిగేస్తుండగా అక్కడికి ఆమె బంధువు వచ్చాడు. అనుమానంగా బాత్‌రూంలో చూడగా నరసింహప్ప చేయి కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అదించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నరసింహప్ప శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం మీద రేణుకను పోలీసులు విచారించారు. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేకనే ఈ హత్య చేశానని చెప్పింది రేణుక. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.