తాగుబోతు భర్తకు విషమిచ్చి చంపిన భార్య - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు భర్తకు విషమిచ్చి చంపిన భార్య

March 6, 2018

మద్యం తాగి ప్రతిరోజూ ఇంట్లో రణరంగం సృష్ఠిస్తున్న భర్తను ఓ ఇల్లాలు విషమిచ్చి చంపింది. మద్యం మానెయ్ అని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని, పైపెచ్చు రూ.12 లక్షల వరకు అప్పు చేశాడని భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని రాజాబజార్‌లో జరిగింది. మూర్తి, రమ భార్యాభర్తలు. వీరిది వరంగల్. ఉద్యోగరిత్యా ఢిల్లీకి వెళ్ళారు. రమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, మూర్తి ఓ స్థిరాస్తి సంస్థలో పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 26న రోడ్డు పక్కన అనుమానాస్పదంగా పడి వున్నారంటూ ఓ మహిళ అతణ్ణి ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వెళ్ళిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మూర్తి మరణించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతను డీ.ఎస్. మూర్తిగా గుర్తించి, అతని భార్య రమకు సమాచారం అందించారు.రమ ఏమీ తెలియనట్టు వచ్చి ఏడుపులు, పెడబొబ్బలు మొదలు పెట్టింది. ఆమె ప్రవర్తన మీద అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో రమను విచారించారు. విచారణలో తనే భర్తకు విషమిచ్చి చంపినట్టు ఒప్పుకుంది. మద్యానికి బానిసైన మూర్తి, 12 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడని రమ వివరించింది. నిత్యం మద్యం తాగివచ్చి తనను కొట్టి, తిట్టి నానా రభస చేసేవాడని వివరించింది. కాలనీలో పరువు పోయేటట్టు ప్రవర్తించేవాడని.. ఎలాగైనా అతణ్ణి వదిలించుకోవాలని పథకం రచించుకుంది.

దక్షిణపురిలోని తాంత్రికుడు శ్యాంసింగ్‌‌ను ఆశ్రయించి, అతనిచ్చిన పదార్థాన్ని తినిపించిన వెంటనే మూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపింది. తనే మూర్తిని ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయానని పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.