ప్రపంచంలోనే పెద్ద అంజన్నకు కోడ్ కష్టం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే పెద్ద అంజన్నకు కోడ్ కష్టం

April 4, 2018

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రభావం ఆంజనేయ స్వామి మీద కూడా పడింది. కోలార్ నుంచి తూర్పు బెంగళూరులోని కచరకనహళ్ళికి 62 అడుగుల ఎత్తున్న హనుమంతుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 750 టన్నుల బరువుగల ఈ విగ్రహాన్ని 300 చక్రాల లారీలో తీసుకు వెళ్తుండగా ఎన్‌హెచ్-48పై హోస్కోట్ సమీపంలో సోమవారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో వుండటం వల్లే విగ్రహాన్ని ఆపామని అంటున్నారు పోలీసులు. ఈ పరిస్థితుల్లో విగ్రహాన్ని తీసుకువెళితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుంది అంటున్నారు.ట్రస్టీ మణిరాజు మాట్లాడుతూ.. ‘పోలీసులు హనుమంతుడి విగ్రహాన్ని అడ్డుకోవడంతో ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాం. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హనుమంతుడి విగ్రహం. శ్రావణబెళగొళలోని గోమఠేశ్వర విగ్రహం ఎత్తు 57 అడుగులు. దానికన్నా ఈ విగ్రహం పొడవైంది. మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో విగ్రహాన్ని తీసుకెళ్ళాం ’ అని తెలిపారు.