ఎమ్మెల్యే.. ఇదేం పని! - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే.. ఇదేం పని!

November 21, 2017

జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి మధ్య ధర్మోనికుంట వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ధర్మోని కుంటను బతుకమ్మకుంటగా మార్చి చివరికి స్విమ్మింగ్ పూల్ మాదిరి చేశారని.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ టూరిజం పేరుతో చెరువును పూడ్చి, అర ఎకర  కబ్జా చేశారని కలెక్టర్ దేవసేన ఆరోపించడం తెలిసిందే.  దీనిపై స్పందించిన ప్రభుత్వం అత్యాధునిక పద్ధతుల ద్వారా కుంట వ్యవహారాన్ని పరిశీలించింది.  రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్‌కు విచారణ బాధ్యతలను అప్పగించింది. ఈ విచారణలో భాగంగా 2001 నుండి 2017 వరకు ధర్మోనికుంట వ్యవహారాన్ని అధ్యయనం చేశారు.సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్‌లు, శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ అధ్యయనం కొనసాగింది. ధర్మోనికుంట బతుకమ్మ కుంటగా మారడం వల్ల జనగామకు ముంపు పొంచి వుందని తేల్చారు. పర్యాటక ఆహ్లాదం పేరుతో కుంటను ఇలా అక్రమంగా కబ్జా చేయటం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ఓ  నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఎలాంటి అనుమతీ  తీసుకోకుండా కుంటను పూడ్చేసి అక్రమ నిర్మాణాలు కూడా వెలిశాయి.. వాటి వెనుక ఎమ్మెల్యే హస్తం వుందనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. చివరికి కలెక్టర్ ఆరోపణే నిజమయ్యింది.