తండ్రి శవం వద్దన్నారు.. చివరకు  చెత్తబండిలో - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి శవం వద్దన్నారు.. చివరకు  చెత్తబండిలో

April 6, 2018

మనుషుల్లో తడి ఆరిపోతోందా ? బంధాలు, అనుబంధాలను విస్మరిస్తున్నారా ? జన్మనిచ్చిన తల్లిదండ్రులను అవసాన దశలో తోడుండి చూసుకోవాల్సిన పిల్లలు వాళ్ళను పట్టించుకోకపోతే వారికి దిక్కెవరు ? అక్కడక్కడా అలాంటి కర్కశ మనుషులు కన్నవాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుబంధమా ఎక్కడున్నావ్ అనాలనిపిస్తుంది. కాళ్ళు చేతులు బాగున్నంత కాలం అందరూ బాగానే వుంటారు. ముదిమ వయసులో కడుపులో పుట్టినవారు కాదని వెలేస్తే వారి పరిస్థితి ఏంటి ? అలాంటి ఘటనే తమిళనాడులోని వేలూరులోని షోలింగర్‌లో జరిగింది. షోలింగర్‌‌కు చెందిన రాజారామ్ (70) ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం దర్జాగా బతికాడు. కొన్నాళ్ల క్రితం అతని భార్య మరణించడంతో రాజారామ్ ఒంటరివాడయ్యాడు. కన్నబిడ్డలు ఆయనను పట్టించుకోవడం మానేశారు. దీంతో అతను మరింత ఆవేదనకు లోనయ్యాడు. ఒక్కరు కూడా ముద్ద అన్నం కూడా పెట్టలేకపోయారు. దీంతో వీధుల్లో భిక్షాటన చేసి జీవించేవాడు. గత నెల 27న ఆయన అనారోగ్యంతో మృతిచెందడంతో, ఆయన బిడ్డలకు పోలీసులు సమాచారం అందించారు. వాళ్లు తండ్రి కడచూపుకు కూడా నిరాకరించారు. మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించారు.  దీంతో మార్చురీలో భద్రపరిచిన ఆయన మృతదేహానికి, పోస్టు మార్టం నిర్వహించి, పారిశుద్ధ్య కార్మికుల సాయంతో చెత్త తీసుకెళ్లే బండిలో తీసుకెళ్లి, దహనక్రియలు నిర్వహించారు. భార్య ఉన్నంతవరకు గౌరవంగా బతికిన వ్యక్తి అంతిమయాత్ర మున్సిపాలిటీ చెత్తబండిలో జరగడం వేలూరు వాసులను ఆవేదనకు గురి చేసింది. తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే పిల్లలు ఎదుగుతారు.. ముసలితనంలో వారికి తోడుగా వుండాల్సింది పోయి అత్యంత కర్కషంగా పట్టించుకోకపోవటం దారుణం అంటూ స్థానికులు కంట నీరు పెట్టుకున్నారు.