3 నెలల  బిడ్డ కడుపులో  పిండం - MicTv.in - Telugu News
mictv telugu

3 నెలల  బిడ్డ కడుపులో  పిండం

December 14, 2017

పండంటి బిడ్డ పుట్టాడని ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మూణ్ణెల్ల తరువాత ఆ పసివాడు ఒకటే ఏడవటం మొదలు పెట్టాడు. వెంటనే డాక్టరుకి చూపిస్తే కిడ్నీలో కణతి అని చెప్పి ఆపరేషన్ చేసి ఆశ్యర్యపోయారు. బిడ్డ పొట్టలోంచి కణతికి బదులు పిండం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.రంజూబాల, సత్యేంద్ర యాదవ్‌ దంపతుల స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని భభువా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. బిడ్డ అనారోగ్యంగా వుండటంతో చాలా ఆసుపత్రులకు తీసుకొని తిరిగారు. చివరికి బెనారస్ ఆసుపత్రికి చేరారు. బాబును పరిశీలించిన డాక్టర్లు బాబు పొట్టలో కణతి వుందని చెప్పి ఆపరేషన్ చేశారు.

ఆ చిన్ని పొట్టలోంచి పిండం బయట పడేసరికి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా పిండం బిడ్డ శరీర భాగాలను ఆహారంగా స్వీకరిస్తూ లోలోపల తినేస్తున్నట్లు గుర్తించారు. దీంతో లోపల ఉన్న పిండాన్ని తీసేశారు. తల్లి గర్భంలో కవలలు విడిపోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని బిడ్డకు ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్లు 200 వరకు జరిగాయని వెల్లడించారు. విజయవంతంగా ఆపరేషన్‌ను నిర్వహించి పిండాన్ని తొలగించామని తెలిపారు. బిడ్డ ప్రస్తుతం కోలుకుంటున్నదని చెప్పారు.