కట్నంగా కొండముచ్చు.. బావమరిదిలా చూసుకుంటాడట! - MicTv.in - Telugu News
mictv telugu

కట్నంగా కొండముచ్చు.. బావమరిదిలా చూసుకుంటాడట!

February 17, 2018

ప్రపంచంలో ఏ పెళ్లి కొడుకు చెప్పుకోలేనంత గొప్పగా ఈ పెళ్లి కొడుకు మాత్రం తన పెళ్ళిలోని కట్నం గురించి గొప్పగానే చెప్పుకుంటాడు. ఎందుకో తెలుసా.. అతని పెళ్ళికి వధువు తరుపువాళ్ళు బైకు, బంగారంతో పాటు కొండముచ్చును కూడా కట్నం కింద ఇచ్చారని. పెళ్లి కొడుకు సైతం కొండముచ్చును తన బావమరిదిగా భావించి, పొలం కాపలా వుంటుందిలే అనుకున్నాడట.

ఈ విడ్డూరం హరియాణాలోని తోహన ప్రాంతంలో జరిగింది. ఫిబ్రవరి 11న ఈ వివాహం జరిగింది. కర్మవీర్ పూనియా కొడుకు సంజయ్ పూనియా దవనఖేడ గ్రామానికి చెందిన హరిచంద్ కూతురును పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి సంప్రదింపుల సమయంలో అమ్మాయి తరుపువాళ్ళు అబ్బాయి తరుపువాళ్ళను కట్నం కింద ఏం కావాలని అడిగారట. ‘మా దగ్గర దేనికీ లోటు లేదు.. మీరేం అడిగినా ఇచ్చేస్తాం’ అని అన్నదే తడవుగా వీళ్ళు వాళ్ళింట్లో వున్న కొండముచ్చును ఇస్తారా అని అడిగారట.

సరదాగా అన్న వరుడి తరుపువాళ్ళ మాటను సీరియస్‌గా తీసుకున్నారు వధువు తరుపువాళ్లు. అంతే కట్నం కింద కొండముచ్చును ఇచ్చేశారు. ఈ విషయం తెలిసి పెళ్ళికి వచ్చినవారంతా ఆశ్యర్యంతో ముక్కున వేలేస్కుంటున్నారు.

కాగా.. ఆ కొండముచ్చు కూడా తమకు ఉపయోగపడుతోందని వరుడు తండ్రి చెబుతున్నాడు. గత మూడేళ్లుగా కోతులు పంటల మీద దాడి చేసి నాశనం చేస్తున్నాయట. ‘ ఈ కొండముచ్చు పాద పుణ్యంతో పొలం పచ్చగా వుంటుంది.. కోడలి పాద పుణ్యంతో ఇల్లు చల్లగా వర్థిల్లుతుంది ’ అంటున్నాడు పెళ్లి కొడుకు తండ్రి. పొలం దగ్గర కొండముచ్చును కాపలాగా పెడితే కోతులు ఆ దరిదాపుల్లోకి రావటానికి జంకుతాయంటున్నాడు.