తెలుపురంగు పూలు, వాహనంతోనే శ్రీదేవి అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుపురంగు పూలు, వాహనంతోనే శ్రీదేవి అంత్యక్రియలు

February 27, 2018

సిరిమల్లె పువ్వు దివికేగింది. అతిలోక సుందరి ఇక ఎప్పటికీ రానంటూ శాశ్వత సెలవు తీసుకుంటూ భూలోకం మీద అలిగి వెళ్ళిపోయింది. కానీ తన ఇష్టాన్ని మాత్రం ఇక్కడే  వదిలి వెళ్ళింది. ఆ ఇష్టాన్ని ఇప్పుడు తన పార్థీవ దేహంతో చివరి వీడ్కోలు పలికి పంపాలనుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించే శ్రీదేవి మనసుకు నచ్చిన రంగు శాంతికి చిహ్నమైన తెలుపు రంగు అవటం విశేషం.‘ఆఖరిపోరాటం’ సినిమాలో  శ్రీదేవి ‘ తెల్లచీరకు తకధిమి తపనలు రేగెనమ్మ ’  పాటలో తెల్లని వస్త్రాలలో మెరిసిపోతూ వుంటుంది. శ్రీదేవి అంతిమ యాత్రకు సంబంధించిందంతా తెలుపు రంగులో ఉండాలన్నదే శ్రీదేవి ఆకాంక్ష అనే వార్త ఒకటి ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం, పువ్వులు తెలుపు రంగువే వినియోగించనున్నట్టు తెలుస్తోంది. అనిల్ కపూర్ ఇంట్లోకి తెల్లని పువ్వులను తీసుకువెళుతున్నట్టు సమాచారం. ఈ రోజు రాత్రి పది గంటలకు శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం పదకొండు గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె పార్థీవ దేహానికి దహన సంస్కారాలు జరుగనున్నట్టు తెలుస్తోంది.