ఫేస్‌బుక్‌లో ఫేక్ గాళ్లతో తస్మాత్ జాగ్రత్త    - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌లో ఫేక్ గాళ్లతో తస్మాత్ జాగ్రత్త   

November 23, 2017

ఫేసుబుక్కులో లైకులు, చాటింగులు, కామెంట్లతో కాలం వెళ్లదీసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎఫ్‌బీలో మనతో చాటింగ్ చేస్తున్నవారు అమ్మాయో, అబ్బాయో తెలుసుకోలేని సందిగ్ధం నెలకొని వున్నది. ఫేక్ ఐడీలతో చాలా మంది మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే మన ఫ్రెండ్స్ లిస్టులో ఎంత మంది ఫేక్ గాళ్లు వున్నారా అనే డౌటు కలుగుతుంది.విజయవాడ సింగ్‌నగర్‌లో వుంటున్న ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిక్వెస్ట్ పంపిన క్షణాల్లోనే ఓకే రావడంతో మనోడు ఆగలేక పోయాడు. ఉత్సాహంతో ఆ అమ్మాయితో చాటింగ్ మొదలు పెట్టాడు. నెమ్మదిగా వారి చాటింగ్ హద్దులు మీరింది. అన్నీ విషయాలు షేర్ చేసుకుని చివరికి ప్రేమలో పడ్డారు.  అలా వారి చాటింగ్ కొంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది.

అయితే తాను చాటింగ్ చేసేది అమ్మాయితో కాదు అబ్బాయితో అని తన మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసి షాకయ్యాడు. తన అత్యుత్సాహానికి సిగ్గుతో తల దించుకున్నాడు. కాస్త ఆలోచించి ఏ తప్పు చెయ్యని తానెందుకు తల దించుకోవాలి అని ఆ చాటింగ్ చేసినవాడికి ఫోన్ చేసి నిలదీసి అడిగాడు. అతను ఏం పట్టనట్టు సమాధానం చెప్పాడు. ఇతనికి మండింది. మాటా మాటా పెరిగింది. అమ్మాయిలా మాట్లాడిన యువకుడు అంతటితో వూరుకోకుండా అతని నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించి సింగ్‌నగర్ యువకుణ్ణి బట్టలూడదీసి మరీ చితకబాదారు. ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించారు. కాగా ఆ యువకుడు వారి బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఒక అబ్బాయి అయివుండి అమ్మాయిలా గొంతు మార్చి మాట్లాడి ఎందుకు మోసాలకు పాల్పడుతున్నాడనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.