సీఎం చనిపోయారు.. ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం చనిపోయారు.. ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్

April 19, 2018

సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే నిజాలను నిర్భయంగా బయటకు ఎలా తీసుకువస్తోందో.. అబద్ధాలను సైతం అంతే ఫాస్టుగా ప్రచారంలోకి తెస్తోంది. తదనుగుణంగా ఏది రియల్ ? ఏది వైరల్ అనే సందిగ్ధంలో జనాలు వుంటున్నారు. కొందరు పని గట్టుకుని ఇలాంటి అసత్య ప్రచారాలకు పూనుకుని ఏం సాధించాలనుకుంటారో వారికే ఓ క్లారిటీ వుండదు ? తాజాగా అలాంటి ఘటనే గోవాలో జరిగింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పారికర్ ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నారు.తీవ్ర కడుపు నొప్పితో ఫిబ్రవరి 5న ఆసుపత్రిలో జాయిన్ అయిన మనోహర్ పారికర్.. ఆ తరువాత కొద్ది రోజులకు కోలుకున్నా మళ్లీ ఆరోగ్యం సహకరించకపోవడంతో విదేశాలకు వెళ్లి మెరుగైన చికిత్సను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగారు చనిపోయారంటూ ఓ 35 ఏళ్ళ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాడు. అతను వాస్కో పట్టణంలో నివసిస్తాడని తెలుసుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అతణ్ణి అరెస్ట్ చేశారు.దీనిపై స్పందించిన గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి సదానంద్ ‘ ప్రస్తుతం సీఎం ఆరోగ్యం మెరుగుపడుతోంది. బహుశా వచ్చే నెలలో ఇండియాకు తిరిగి రావొచ్చు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు రావడం బాధ కలిగించింది ’ అని అన్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా వుండటం అంటే అదేదో సోషల్ వర్క్ చేస్తున్నట్టు భావిస్తున్న కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకుంటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.