పేలిన ఇంజిన్.. 149 మందిని కాపాడిన లేడీ పైలట్ - MicTv.in - Telugu News
mictv telugu

పేలిన ఇంజిన్.. 149 మందిని కాపాడిన లేడీ పైలట్

April 19, 2018

గాలిలోకి ఎగిరిన విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురవుతుంటే ఎలా వుంటుంది ? లోపల చాలా గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఇక తమకు ఈ భూమి మీద నూకలు చెల్లాయి అనుకుంటారు. కానీ వారందరి భయాన్ని రూపుమాపి ధైర్యంగా విమానాన్ని ప్రమాదం నుంచి కిందికి సురక్షితంగా దించింది ఓ లేడీ పైలట్. 149 మంది ప్రయాణికులను కాపాడిన ఘటన అమెరికా విమానంలో చోటు చేసుకుంది.

సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌‌కు చెందిన నంబర్‌ 1380 విమానం, న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌‌కు 144 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయల్దేరింది. 30,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్ ఒక్కసారిగా పేలింది. ఇంజిన్ పేలడంతో విమానం ఫ్యాన్‌ బ్లేడ్‌ చెడిపోయి, పదునైన రెక్క దూసుకొచ్చి విమానం కిటికీని బలంగా తాకింది. దీంతో కిటికీ పగిలిపోయింది. కిటికీ పక్కనే కూర్చున్న రియోర్డాన్ అనే మహిళా ప్రయాణికురాలు కిందికి జారి పడబోయింది. సహ ప్రయాణీకులు ఆమెను పైకి లాగారు.

దీంతో విమానంలో గందరగోళం రేగింది. ప్రయాణికులందరూ తమకు భూమిమీద నూకలు చెల్లిపోయాయని భావించారు. తమ తమ దైవాలను ప్రార్థించుకుంటున్నారు. కానీ ఆ విమానం నడుపుతున్న పైలట్ టామ్ జో షల్ట్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఫిలడెల్పియాలోని కంట్రోల్ రూంను సంప్రదించింది. వారి సూచనల మేరకు విమానాన్ని ఆమె సురక్షితంగా కిందికి దించారు. అమెరికన్‌ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట‍్లలో టామ్‌ జో షల్ట్స్‌ ఒకరు. ఆమెకు సూపర్‌ సోనిక్‌ ఎఫ్‌జె-18 హార్నెట్స్‌ వంటి విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆమె విమానాన్ని సురక్షితంగా కిందికి దించి, శభాష్ అనిపించుకున్నారు.

కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఈ ప్రమాదం నుంచి అంతమంది ప్రాణాలను కాపాడిన పైలట్ చాకచక్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు.