ఎమ్మెల్యే కొడుకు.. పబ్‌లో దాడి,  ఆస్పత్రిలో హత్యాయత్నం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే కొడుకు.. పబ్‌లో దాడి,  ఆస్పత్రిలో హత్యాయత్నం..

February 19, 2018

తాగిన మైకంలో తామేం చేస్తున్నారో మరిచిపోతున్నారు కొందరు. తండ్రికున్న హోదాను అడ్డు పెట్టుకున్న ఓ కొడుకు అచ్చం  సినిమాల్లో విలన్ మాదిరి గూండాగురీ చేసిన  ఘటన బెంగుళూరులోని శాంతినగర్‌లో జరిగింది.  శాంతినగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్, అతని స్నేహితులు కలిసి ఓ పబ్‌లో ఫూటుగా తాగారు. ఆ సమయంలో డాలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త లోక్‌నాథ్ కుమారుడు విద్వత్ (24), అతని సోదరుడు సాత్విక్ అదే పబ్‌లో ఉన్నారు. విద్వత్ కాలు చాపుకొని కూర్చుని వుండగా అతని కాలు పొరపాటున మోహమ్మద్ కాలికి తగిలింది. అంతే మహమ్మద్ కోపంతో రెచ్చిపోయాడు. అత్యంత పాశవికంగా అతని మీద దాడి చేసి, హత్యాయత్నం చేశాడు. అడ్డొచ్చిన సోదరుణ్ణి కూడా చితకబాదేశాడు.తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్ళిన విద్వత్‌ను మాల్యా ఆసుపత్రికి తరలించారు. అంతటితో మహమ్మద్ పగ చల్లారలేదు. అతణ్ణి చంపెయ్యాలని అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్లిన మహమ్మద్, అతని స్నేహితులు చికిత్స పొందుతున్న విద్వత్ మీద మళ్ళీ దాడి చేశారు. ముఖం పగిలి ఎక్కువ రక్తం పోవడంతో విద్వత్ సృహ తప్పిపోయాడు. వెంటనే వైద్యులు అతణ్ణి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పైగా నిందితుడు ‘ పోలీసు కేసు పెడితే నిన్ను పూర్తిగానే లేపేస్తాం ’ అని విద్వత్‌ను హెచ్చరించి ఆస్పత్రి  నుంచి వెళ్లిపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న విద్వత్ తండ్రి ఆసుపత్రి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనలో నిందితుడైన ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చెయ్యకుండా నిర్లక్షం చేసిన ఏసీపీ, ఇన్స్‌పెక్టర్‌ను బెంగళూరు నగర పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు మహమ్మద్‌ను ఈ రోజు అరెస్ట్ చేశారు.