మాఝీ జీవితం మారిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మాఝీ జీవితం మారిపోయింది..

December 7, 2017

కొండంత దు:ఖం అతని జీవితంలోకి ఇప్పుడు వెలుగును తీసుకువచ్చింది. అతనే ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన గిరిజనుడు ధనా మాఝీ. మాఝీ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అత్యంత దుర్భరమైన సంఘటన..  అంబులెన్స్ ఇవ్వకపోవటంతో చనిపోయిన భార్య శవాన్ని భుజం మీద ఎత్తుకుని 10 కిలోమీటర్లు కాలి నడకన తన వూరికి వెళ్ళిన దైన్యం గుర్తుకువస్తుంది కదూ. ఏడాది క్రితం వరకు అతని జీవితంలో తలలో ఎన్ని వెంట్రుకలు వున్నాయో అన్ని సమస్యలతో సతమతమయ్యాడు. చివరికి జబ్బున పడ్డ భార్యకు సరైన వైద్యం చేయించలేక భార్యను కోల్పోయాడు. భార్య శవాన్ని తీసుకెళ్లడానికి ఆటో ఛార్జీలకు కూడా డబ్బుల్లేక భుజం మీద ఎత్తుకెళ్ళాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన చాలా మందిని కదిలించింది. ప్రపంచ మీడియాలో ఈ కథనం పతాక శీర్శిక అయింది.

చాలా మంది దయార్ద్ర హృదయులు  స్పందించి మాఝీకి ఆర్థిక సాయం చేశారు. బహ్రెయిన్‌ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా రూ.9 లక్షల చెక్కును మాఝీకి పంపించారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేశాయి. ఇప్పుడు మాఝీ రూ.65 వేలు విలువ చేసే హోండా ద్విచక్రవాహనాన్నికొనుక్కున్నాడు. ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన కింద కొత్త ఇంటిని అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అతడికి సహాయం కింద వచ్చిన నగదును బ్యాంకులో ముగ్గురు కూతుళ్ళ పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేశాడు.

అలాగే ముగ్గురు కుమార్తెలు భువనేశ్వర్‌లోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో చక్కగా చదువుకుంటున్నారు. ఓ విద్యాసంస్థ ఆయన కుమార్తెలకు ఉచితంగా విద్యను అందిస్తోంది. అలమతిదై అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆమె గర్భిణి.