లాకర్ ఎత్తుకెళ్లి పగలేసిన దొంగలకు షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

లాకర్ ఎత్తుకెళ్లి పగలేసిన దొంగలకు షాక్..

March 1, 2018

దురదృష్టపు దొంగలంటే వీళ్ళేనేమో.. లాకర్‌లో కిలోల్లో బంగారం వుంటుందనుకొని దాన్ని ఎత్తుకెళ్ళి పగులగొట్టాక అందులో వంద నోటు మాత్రమే వుంది. దాంతో వాళ్ళు అయ్యో ఇంత కష్టపడింది ఈ ముష్ఠి వంద రూపాయల కోసమా ? అని ఉసూరుమన్నారు. బెంగళూరులోని జేసీ నగర్‌లో ఈనెల 20న ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంగారు దుకాణం యజమాని భాటియా నాలుగు రోజుల పాటు ఊరెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఇంటి పనిమనిషి తన దొంగ గ్యాంగ్‌‌కి సమాచారం అందించింది. ఏడుగురు ముఠా సభ్యులు ఇంట్లోకి చొరబడ్డారు.ఇంట్లో ఉన్న 25కేజీల బరువుండే లాకర్‌ను పగులగొట్టి అందులోని బంగారం, నగదు దోచుకుందామని ప్రయత్నించారు. అది ఎంతకీ పగలకపోవడంతో ఏకంగా దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. హమ్మయ్య ఈ లాకర్‌ను పగలగొడితే మా లైఫ్ సెట్టైనట్టే అని మురిసిపోతూ పగులగొట్టి చూశారు. పగిలిపోయిన లాకర్‌లోంచి వంద రూపాయల నోటు మాత్రమే వచ్చింది. దీంతో ఆ బంగారం దుకాణం యజమానిని తిట్టుకున్నారు. ‘ వూరెళ్తూ ఆ భాటియా చాలా తెలివిగా లాకర్‌లోంచి బంగారం ఎక్కడ దాచిపెట్టి వెళ్ళాడో ’ అని నెత్తీనోరు బాదుకున్నారు.

ఈ దొంగలు వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తారు. పోలీసులు ఆ దొంగల ముఠాని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి దాదాపు రూ.7లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.