ఆమె పేరు ‘లోకులు కాకులు అంటీ..’.. మరి మీ పేరు?

రోజురోజుకు సమాజం మానసికంగా దిగజారుతోందా ? కొందరికి ఇప్పుడు మానసిక రుగ్మతలు ఎక్కువయ్యాయి. ఎదుటివారిని అపహాస్యం పాలు చేసి ఒక రకమైన పైశాచికానందాన్ని పొందుతున్నారు. సోషల్ మీడియా వేదికను ఆ కొందరు నిర్వీర్యం చేస్తున్నారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ఓ పెద్దావిడ తన స్టైల్లోనే చిన్న రివ్యూ చెప్పింది. అంతే అదే ఆమె చేసిన పాపం అయినట్టు బుక్ చేసేశారు. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోన్లు ఆన్ చేసి మాట్లాడండి ఆంటీ, వీడియో తీస్తాం అని కాస్త కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు.

ఆమెకు కొందరు ఆకతాయిలు పెట్టిన పేరు ‘లోకులు కాకులు ఆంటీ’ అని. ఈమధ్య ఈమె వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంటున్నాయి. సోషల్ మీడియాలోని అన్నీ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వాయిస్‌తో టిక్‌టాక్ వీడియోలు కూడా తీశారు. కొందరు సెలెబ్రిటీలు కూడా ఆమెను అనుకరిస్తున్నారు. నవ్వులాటగా చూపిస్తున్నారు. యాంకర్ శ్రీముఖి ఆమెను కలిసింది కూడా. తన పేరు జ్యోతి అని హోంగార్డుగా పని చేస్తున్నానని ఆమె చెప్పారు.

తనకొక కొడుకు వున్నాడని, తనది కర్నూలు అని వెల్లడించారు. ఆమె అనర్గళంగా మాట్లాడుతూ… ఓ సందర్భంలో ‘లోకులు కాకులు’ అంది. దీంతో జనం ఆమెకు ‘లోకులు కాకులు ఆంటీ’ అని పెట్టేశారు. ఎవరు పడితే వాళ్ళు ఆమె ఎక్కడ కనిపించినా వదలడంలేదు. ఫోన్‌లో కెమెరాలు ఆన్ చేసి మాట్లాడించి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆమె మానాన ఆమె సినిమాలు చూసుకుంటుంటే వెళ్లి మైకులు పెట్టి బలవంతంగా మాట్లాడించి చిరాకు తెప్పిస్తున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి అసలు సంబంధమే లేదు. పైగా ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం కూడా పాపం ఆమెకు తెలిసినట్టు లేదు. నగరంలో ఆటోల్లో, బస్సుల్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆమెను విసిగించేస్తున్నారు. కొందరు అతి చేస్తూ తిడుతున్నారు కూడా. సాటి మనిషిగా, అంతకన్నా ఎక్కువగా ఒక అమ్మను అవమానిస్తున్నారనే కనీస విజ్ఞతను కూడా కోల్పోతున్నారు.

ఆమె మాట్లాడటాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఆమె వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా అన్న కనీస సంస్కారం కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. ఫోన్లు తన ముందు పెట్టొద్దని ఆమె హెచ్చరించినప్పటికీ కొందరు వినకుండా పెట్టేసి వీడియోలు చేసి, పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసి క్యాష్ చేసుకుని అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. ఆమె ఎక్కడ కనిపించినా ఈలలు, కేకలు వేస్తూ వేధిస్తున్నారు. దీంతో ఆమె ఆ అరుపులకు భరించక చెవులు మూసుకుంటున్నట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఆమెను, ఆమె మాటలను కామెడీ చేయడం ఆపడంలేదవ్వరు. ఇలాంటి అల్లర్లు ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇకనైనా ఆమె వీక్‌నెస్‌ను వాడుకోకుండా ఆమె ఓ అమ్మ అని భావించి వదిలేస్తే బాగుంటుందని, ఆ అమ్మతో ఓవరాక్షన్ ఆపుతారని సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు.