మెట్రోతో ఆర్టీసీ మరిన్ని డబ్బులు - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోతో ఆర్టీసీ మరిన్ని డబ్బులు

December 2, 2017

హైదరాబాద్ మెట్రో రైలు వస్తే ఆర్టీసీకి సెగ తగులుతుందనే ఊహాగానాలు తలకిందులయ్యాయి. ఆర్టీసీకి ఏమాత్రం ఆదాయం తగ్గలేదు సరికదా పెరగడం గమనార్హం. అందరూ మెట్రో రైలులో ప్రయాణిస్తారు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోతుందనుకున్నారు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి.గ్రేటర్‌లో ఆర్టీసీ ఆదాయం సగటున రోజుకు రూ.2.88 కోట్లు కాగా, మెట్రో అందుబాటులోకి వచ్చాక  అదనంగా మరో రెండు లక్షలు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రోజువారీ ప్రయాణించే వారు కాకుండా మెట్రో ప్రారంభమైన ఈ మూడు రోజుల్లో అదనంగా మరో 20-25 వేల మంది వరకు ప్రయాణిస్తున్నట్టు తేలింది. మెట్రో ఎక్కేందుకు ప్రయాణీకులు బస్సుల్లో ప్రయాణించడం వల్లే ఆదాయం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు.

పైగా మెట్రో కొత్తగా ప్రారంభమవడం వల్ల చాలా మంది కొత్త అనుభూతిని పొందటానికి తండోపతండాలుగా మెట్రోకు తరలి వస్తున్నారు. ఆ క్రమంలో మెట్రో స్టేషన్ వరకు బస్సులో వెళ్ళక తప్పని పరిస్థితి. అలాగే చుట్టు పక్కల వూళ్ళ నుండి వస్తున్న జనాలు సైతం మెట్రోలో ఎక్కాలని ఉబటాట పడటంతో ఆర్టీసీకి మెట్రో వల్ల ఆదాయం పెరిగిపోయిందంటున్నారు అధికారులు.
నగరంలోని 28 ఆర్టీసీ బస్ డిపోల నుంచి 1700 బస్సులు మెట్రో కారిడార్‌లోని ఏదో ఒక ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నాయి.  మెట్రో ఎక్కాలనుకునే ప్రజలు వీటిలో వెళ్తున్నారు. మరోవైపు మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.