ముహూర్తానికే బిడ్డ పుట్టాలట  - MicTv.in - Telugu News
mictv telugu

ముహూర్తానికే బిడ్డ పుట్టాలట 

September 11, 2017

రాను రాను రాజు గుర్రం గాడిదైందన్నట్టే తయారౌతున్నారు మనుషులు. లేకపోతే ఏంటి ?  వీళ్ళ ముహూర్తాలు, మూఢ నమ్మకాల పిచ్చి గర్భిణీ స్త్రీల మీదనా ? జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇలాంటి ముహూర్త ప్రసవాల సంఖ్య పెరిగిపోతోందదని అక్కడి డాక్టర్లు విస్తుపోతున్నారు. కాలం వైజ్ఞానికంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందినా ఈ మూఢ నమ్మకాలను వదలటం లేదనటానికి జగిత్యాలలోని కొంతమంది నిదర్శనం. తొమ్మిది నెలలు నిండాక డాక్టర్ ఫలానా తారీఖున డెలెవరీ అవుతుందని డేట్ ఇస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరాసరి జ్యోతిష్యుడి దగ్గరికి పరుగెత్తుకుపోతున్నారు. ఏ ముహూర్తానికి బిడ్డ పుడితే బాగుంటుందో ఆయన్ని అడిగితే ఆయనొక టైం చెప్తాడు. పంతులు ఫిక్స్ చేసిన ముహూర్తానికే డాక్టర్ ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే పురిటి నొప్పులు వచ్చినా ప్రసవం కాకూడదు..!!

ఇక్కడ ఇంకొక చిక్కు ఏమిటంటే ఇటు అత్తింటివారు ఒక జ్యోతిష్యుడు దగ్గర ఒక ముహూర్తం టైం తీసుకుంారు. అటు అమ్మింటివారు వేరే జ్యోతిష్యుణ్ణి కలిసి వాళ్ళొక ముహూర్తం టైం తీసుకుంటారు. లేదు మా పంతులు చెప్పింది కరెక్టంటే, లేదు మా పంతులు చెప్పిందే అసలు ముహూర్తమని కీచులాడుకుంటున్నారట. వార్నీ.. వీళ్ళ విడ్డూరం సంతకెళ్ళినట్టు లేదు! అక్కడ నెలలు నిండిన గర్భిణి ప్రాణాల గురించి ఎవ్వరికీ చింత లేదు. పుట్టే బిడ్డ పంతులు చెప్పిన ముహూర్తానికే పుట్టాలంట. మరీ చాధస్తంగా లేదూ… వీళ్ళనుకున్న ముహూర్తాలకి డాక్టర్ కు వేరే ఆపరేషన్ వుంటుంది. అప్పుడెలా ? డాక్టర్లకు పెద్ద డైలమా పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారట. డాక్టర్ అటు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలా ? ఇటు గర్భిణి ప్రాణాలు కాపాడాలా అనే సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతున్నారు డాక్టర్లు..

అయినా.. మనం నిర్ణయించిన టైంకి బిడ్డను బలవంతంగా భూమ్మీదకు తీసుకురావడమేంటో ? ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల గర్భిణుల ప్రాణాలకు చాలా ప్రమాదమని వాళ్ళెందుకు గ్రహించట్లేదు ?  డాక్టర్ల వల్ల పొరపాటు జరిగితే ఎన్నో లొల్లులు అవుతాయి. డాక్టర్లనే ఇరకాటంలో పెడుతున్న ఇలాంటి వారికి బుద్ధి ఎవరు చెప్పాలో ? మూఢ నమ్మకాలను బలంగా ప్రజల మీద రుద్దుతున్న జ్యోతిష్యులది తప్పొనచ్చా ? మూఢ నమ్మకాలను నమ్ముతున్న వారి తప్పనొచ్చా ?