వీడిన మిస్టరీ.. భర్త, మరిది, అత్తలే హంతకులు - MicTv.in - Telugu News
mictv telugu

వీడిన మిస్టరీ.. భర్త, మరిది, అత్తలే హంతకులు

February 12, 2018

గత నెల 29న కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో గోనెసంచిలో ముక్కలు ముక్కలుగా వున్న మహిళ మృతదేహం తాలూకు మిస్టరీని ఎట్టకేలకు చేధించారు పోలీసులు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె మత్య కేసులో కీలక నిందితుల్లో ఒకర్ని పట్టుకున్నారు. ఇద్దరు పరారీలో వున్నట్టు తెలిపారు. అత్త, మరిది, భర్తలు కలిసి ఈ హత్య చేసినట్టు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిహార్‌కు చెందిన అమరకాంత్‌ ఝా కుటుంబం గత కొంత కాలంగా హైదరాబాద్‌ మాదాపూర్‌ సిద్దిఖినగర్‌లో నివాసం ఉంటోంది. అమర్‌కాంత్‌ ఝా స్థానికంగా ఓ బార్‌లో పని చేస్తున్నాడు. కుటుంబంలో తలెత్తిన విబేధాల కారణంగా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ విబేధాలు మరింత ముదిరి గత నెల 28వ తేదీన అమర్‌కాంత్‌ ఝా కుటుంబసభ్యులు గర్భిణిగా ఉన్న పెద్ద కోడలిని దారుణంగా హతమార్చారు. ఎవరు గుర్తు పట్టని విధంగా ముఖాన్ని ఛిద్రం చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ సంచుల్లో వేశారని చెప్పారు.

ఈ కేసులో పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారాలుగా మారాయి. 29 తెల్లవారు జాము మూడున్నర గంటల ప్రాంతంలో హతురాలి శరీర భాగాలను గోనె సంచిలో కట్టి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చిన నిందితులు కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద పారవేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటనలో నిందితులకు సంబంధించి ఆచూకీ కోసం పోలీసులు లక్ష రూపాయల నజరానా ప్రకటించి, హతురాలి ఊహాచిత్రాన్ని కూడా విడుదల చేశారు. గత రెండు వారాలుగా అనేక కోణాల్లో కేసును పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకున్నారు. పరారీలో వున్న మృతురాలి మరిది, భర్తను త్వరలోనే పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెడతామని పోలీసులు పేర్కొన్నారు.