నిజాం చట్టంతో  హిజ్రాల హక్కులకు భంగం - MicTv.in - Telugu News
mictv telugu

నిజాం చట్టంతో  హిజ్రాల హక్కులకు భంగం

March 1, 2018

హిజ్రాలపై అన్యాయంగా కేసులు బనాయిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నతెలంగాణ యూనక్స్‌ చట్టం అమలును నిలిపివేయాలని.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కె. విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

99 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం కింద రాష్ట్రంలో కేసులెన్ని నమోదయ్యాయో పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ అన్నారు. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.  తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ యూనక్స్‌ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దానిని కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన వి.వసంత, కేఎంవీ మోనాలీసా, మరొకరు హైకోర్టులో  పిల్‌ వేశారు.  శతాబ్దం కిందట (1919) నిజాం కాలంలో హిజ్రాలకు సంబంధించి తీసుకొచ్చిన తెలంగాణ యూనక్స్‌ చట్టంలోని కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిబంధనలను తాము కొట్టేయడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలంది. రాజ్యాంగం అమల్లోకి రాక ముందు తీసుకొచ్చిన ఈ చట్టంపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది.

15–16 ఏళ్ల బాలుడిని హిజ్రాలు తమ వద్ద ఉంచుకోవడం నేరమన్న ఈ చట్ట నిబంధనలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సమాజంలో పిల్లలపై జరుగుతున్న నేరాలన్నింటిని హిజ్రాలపై అపాదించడం ఏమాత్రం సబబు కాదంది. హిజ్రాలు నాట్యం, సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటే అరెస్ట్ చేయట సరికాదని అభిప్రాయపడింది. అలాగే ఆ చట్టం పేరులోంచి యూనక్స్ ( నపుంసకుడు ) అనే పదాన్ని నిర్మూలించాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.