ఆమె ఆ నెమలిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది.. తను ఎటు పోతే అటు దాన్ని కూడా తీసుకెళ్ళడం ఆమెకు అలవాటుగా మారింది. ఆ అలవాటు పొరపాటు అని న్యూజెర్సీలోని నీవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం స్పష్టం చేసింది. కారణం ఆ నెమలి సైజు పెద్దగా వుండటమే. ఎంచక్కా తనతోపాటు విదేశాలకు వెళదామని విమానాశ్రయానికి నెమలిని తనవెంట తీసుకొచ్చింది. కానీ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌వారు నెమలిని విమానంలోకి ఎక్కించటానికి నిరాకరించటంతో ఆమెకు ఎక్కడాలేని కోపం వచ్చింది.
తన నెమలికి కూడా టికెట్ తీసుకుంటానని అనుమతించాలని సిబ్బందిని అడిగింది. అంతేనా ‘ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్ ’ నిబంధన ప్రకారం తన పక్షిని విమానంలో తీసుకెళ్లే హక్కుందని కూడా వాదించింది. కానీ అధికారులు ఆమె సెంటిమెంట్‌ను అర్థం చేసుకోలేదు. ‘ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్ ’ అని జంతువులకు కూడా కొన్ని షరతులతో విమానంలో ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ నెమలి నిబంధనలకు అనుగుణంగా లేదని, దాని సైజు, బరువు చాలా ఎక్కువగా ఉందని అధికారులు అనుమతి నిరాకరించారు.సదరు మహిళ నెమలితో విమానాశ్రయానికి వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన నెమలిని ఎలాగైనా విమానంలో ఎక్కించి దాని సరదా, తన ముచ్చట తీర్చుకోవాలనుకున్న ఆ మహిళ కోరిక నెరవేరక ఉసూరుమన్నది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆ మహిళ టికెట్ డబ్బును వెనక్కి ఇవ్వడంతోపాటు ఆమె విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లడానికి అయ్యే డబ్బు కూడా చెల్లించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న జంతువులను విమానంలో ప్రయాణించేందుకు తాము సహకరిస్తామని, ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్కు తమ మద్దతు ఉంటుందని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించేసరికి గమ్మున ఇంటికెళ్లిపోయిందామె.
ఆమె గతంలో కూడా ఈ నెమలిని వెంటబెట్టకుని పలు విమానాశ్రయాల్లో తిరిగిందని, అక్కడా ఆమెకు చుక్కెదురైందని గతంలో విమాన సిబ్బందిగా పనిచేసిన వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే ఆమెకు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. ఆమెకు అనుమతివ్వాల్సిందేనని, నెమలి దాని సైజుకు మించి పెరగదు కదా అని హితవులు పలుకుతున్నారు.