సెన్సార్ బోర్డుపై నారాయణమూర్తి ఫైర్..  జీఎస్టీ మహిమ.. - MicTv.in - Telugu News
mictv telugu

సెన్సార్ బోర్డుపై నారాయణమూర్తి ఫైర్..  జీఎస్టీ మహిమ..

April 12, 2018

నారాయణమూర్తి.. పేరు వింటేనే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజా పోరాటాలు గుర్తుకొస్తాయి. వ్యాపార విలువల్లేకుండా, అశ్లీలం జోలికి పోకుండా జనజీవితాలనే ప్రధానంగా చిత్రీకరిస్తారు ఆయన. అలాంటి దర్శకుడి సినిమాకు ఇప్పుడు జీఎస్టీ చిక్కొచ్చిపడింది. జీఎస్టీ అనే పేరు వినిపిస్తే చాలు కట్ కట్ అని రెచ్చిపోతున్న సెన్సార్ బోొర్డు నారాయణమూర్తి సినిమాపైనా అభ్యంతరం చెప్పింది.

దీనిపై ఎర్రన్న కళ్ళు ఎర్రజేశారు. ఆయన కొత్త సినిమా ‘అన్నదాత సుఖీభవ ’లో జీఎస్టీ, రైతులు, పెట్టుబడిదారులు వంటి పదాలున్న డైలాగులను తీసేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. అలా చేస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసింది. దీనిపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు.‘అన్నదాత సుఖీభవ సినిమాలో రైతుల గోస చూపించాను. జీఎస్టీ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చెప్పాం. అందుకు వ్యతిరేకంగా కొన్ని సీన్లు, డైలాగులు ఈ సినిమాలో వున్నాయి. అవన్నీ అసత్యాలు కావు. జరిగినవే, జరుగుతున్నవే సినిమాలో పెట్టాను తప్పించి జీఎస్టీని బద్నాం చెయ్యాలని కల్పించి చెప్పిన సన్నివేశాలు, మాటలు కావు అవి. బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు గానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు లాంటి డైలాగ్స్‌ను తొలగించాలని కోరటం దారుణం’ అని ఆయన అన్నారు.  ‘రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామికవేత్తలు ఏం పుణ్యం చేశారు? భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికా?’ అని మండిపడ్డారు.

తాను 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నానని.. అవన్నీ ప్రజల పక్షంగా ఉంటున్నాయే తప్ప ఎవర్నీ కించపరిచేలా తీయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ సీన్లు తొలగించని కారణంగా నా సినిమాకు సెన్సార్‌ చేయలేదు. నేను న్యాయం కోసం రివైవింగ్‌ కమిటీకి వెళ్తాను ’ అని తెలిపారు.