ఫోన్ పోయినా.. మీ డేటా సేఫ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ పోయినా.. మీ డేటా సేఫ్..

February 2, 2018

అయ్యో నా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాను.. ఇప్పుడెలా ? అందులో వున్న డేటా మొత్తం పోతుందే.. నేనేం చెయ్యాలి ? ’ వంటి భయాలు ఇక అక్కర్లేదు  అంటోంది ప్రభుత్వం. పోన్‌లోని సిమ్‌కార్డును తీసివేసి కొత్త కార్డును వేసినా, ఐఎంఈఐ నంబర్‌ను మార్చినా.. ఆ ఫోన్‌ పనిచేయకుండా బ్లాక్‌ చేసేలా ప్రభుత్వమే మొబైల్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

‘అబ్బా ఇవాళ నక్క తోక తొక్కాన్రా.. స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ డేటా వగైరా.. వగైరా.. దొరికాయ్ ’ అంటూ ఫోన్ దొరికిన వాళ్ళు, దొంగిలించిన వాళ్ళు సంబరపడే రోజులకు కాలం చెల్లినట్టే ఇక. ముబైల్ ఫోన్లు ఇలా చోరీకి గురి అవడం వల్ల వినియోగదారుడికి నష్టం వాటిల్లడమే కాకుండా, అతని వ్యక్తిగత జీవితానికి, దేశ భద్రతకు కూడా నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం ఈ కొత్త యోచనకు ముందడుగు వేసింది.

సెంట్రల్‌ ఎక్విపమెంట్స్‌ ఐడెంటిఫై రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) పేరుతో టెలికం శాఖ (డీవోటీ) ఆధ్వర్యంలో ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయనుంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందించనున్నది. ఈ మేరకు నకిలీ హ్యాండ్‌సెట్‌లను నిరోధించడం, హ్యాండ్‌సెట్‌ల చోరీలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని మొబైల్‌ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌కు సీఈఐఆర్‌ను అనుసంధానించడం ద్వారా చర్యలు తీసుకోనుంది. ఐఎంఈఐ నంబర్‌ను టాంపరింగ్‌ చేయడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నది. డీవోటీ  నిబంధనల ప్రకారం కనీసం మూడేళ్ళ జైలుశిక్ష పడనున్నట్టు తెలిపారు.