అమాయకుడికి థర్డ్‌డిగ్రీ.. ఈ పోలీసులనేం చెయ్యాలి? - MicTv.in - Telugu News
mictv telugu

అమాయకుడికి థర్డ్‌డిగ్రీ.. ఈ పోలీసులనేం చెయ్యాలి?

November 30, 2017

చేయని నేరానికి అభం శుభం తెలియని ఓ వ్యక్తిని పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టి గాయాలపాలు చేశారు. నాకేం తెలియదు మొర్రో.. అని మొత్తుకుంటున్నా.. ‘నిజాన్ని’ కక్కించడానికి

థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. లాఠీ దెబ్బలు, మోకాళ్లపై రోకలి.. కరెంట్ షాకులు.. మరెన్నో మాటల్లో చెప్పలేని హింసతో మూడు రోజులపాటు అతనికి నరకం చూపించారు.అయితే దర్యాప్తులో చివరికి నేరస్తుడు అతడు  కాదు, వేరేవాడు అని తెలిసేసరికి చిన్న ‘సారీ’ చెప్పి అతణ్ణి వదిలిపెట్టారు. ఒళ్ళంతా వాతుల, నెత్తురు..  తీవ్ర గాయాలతో అతను నడవలేని స్థితిలో ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరం కాపువీధికి చెందిన రాహుల్ జైన్ బంగారు వ్యాపారి. అతను ప్రకాశం జిల్లాలోని పలు జ్యూయలరీ దుకాణాలకు ఆర్డర్లపై బంగారు నగలు తయారుచేసి చేస్తున్నాడు.  

ఈ నెల 26న రాహుల్ జైన్ కారు డ్రైవర్‌ వెంకట స్వామితో కలిసి కారులో నెల్లూరు నుంచి టంగుటూరు, కందుకూరు, సింగరాయకొండలోని వ్యాపారస్తులకు ఆభరణాలు ఇచ్చి, గతంలో బాకీ వున్న నగదును వసూలు చేసుకుని ఒంగోలుకు వెళ్ళాడు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కారును పార్క్ చేసి ఇద్దరూ కలిసి భోజనం చెయ్యటానికి హోటల్లోకి వెళ్ళాడు.

ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు మారు తాళం చెవులతో కారు డోర్లు తీసి, అందులో ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. రాహుల్ జైన్ వెంకటస్వామి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెంకట స్వామిని అదుపులోకి తీసుకుని.. దొంగలెవరో.. అతనికి  తెలుసన్నట్టు, వారి పేర్లు చెప్పమని తీవ్రంగా కొట్టారు. నాకేం తెలియదని ఎంత మొత్తుకున్నా వినలేదు.  కోవూరు రాళ్ళదిబ్బకు చెందిన పి. వెంకటస్వామి కారు డ్రైవర్. వెంకటస్వామికి అతని మిత్రుడు అశోక్ ఫోన్ చేసి రాహుల్ జైన్‌ను ఒంగోలు తీసుకు వెళ్ళాలని చెప్పాడట.. అంతే.  

చివరకు అసలు దొంగ పాత డ్రైవరేనని తేలడంతో పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న వెంకటస్వామికి సారీ చెప్పి మంగళవారం రాత్రి వదిలివేశారు. దీంతో బాధితుడు నెల్లూరు చేరుకుని బుధవారం  చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని బాధితుడు మీడియా ముందు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది, తనకేం జరిగినా పోలీసులదే బాధ్యత అంటున్నది వెంకటస్వామి భార్య.