బతికి ఉన్నోడిపై రాజకీయం.. అదే నేటి ట్రెండ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బతికి ఉన్నోడిపై రాజకీయం.. అదే నేటి ట్రెండ్ !

January 30, 2018

చనిపోయాడని బతికున్న వ్యక్తిపై   కొందరు వదంతులు సృష్టించి  మత ఘర్షణలకు దిగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కానీ ఆ వ్యక్తి చనిపోలేదు. శుభ్రంగా బతికే వున్నాడు. కాస్‌గంజ్‌లో గణతంత్ర దినోత్సవం నాడు ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో చందన్‌ గుప్తాతోపాటు రాహుల్‌ ఉపాధ్యాయ్‌ కూడా చనిపోయాడని తీవ్రస్థాయిలో సోషల్‌ మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. రాహుల్‌ మృతి చెందాడన్న వదంతులను నమ్మిన నిరసనకారులు  గత మూడు రోజులుగా హింసా కాండకు దిగుతున్నారు.

పోలీసులు రంగప్రవేశం చేసి రాహుల్ చనిపోలేదని నిర్ధారణ చేశారు. మంగళవారం రాహుల్ ఉపాధ్యాయ్ మీడియా ముందుకు వచ్చి ‘నేను చచ్చిపోలేదు మొర్రో.. బతికే వున్నాను. అల్లర్లు జరిగిన సమయంలో నేను కాస్‌గంజ్‌లో  లేను. నేను ఊరికి వెళ్లాను. నేను క్షేమంగా వున్నాను. నాపై రాజకీయాలు చెయ్యొద్దు.. ’ అంటూ మొర పెట్టుకున్నాడు. తాను చనిపోయానని  చేస్తున్న అల్లర్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోవడం తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న రాహుల్ తెర ముందుకు రాక తప్పలేదు. తాను రాకపోతే వారు మరింత ఉన్మాదులుగా మారతారన్నాడు.

మతఘర్షణలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు అలీగఢ్‌ రేంజ్‌ ఐజీ సంజీవ్‌ గుప్తా తెలిపారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు చేపట్టిన ‘ తిరంగా యాత్ర ’లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో 51 మందిపై అభియోగాలు వున్నాయి. కాగా పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.