కోటి వ్యూస్ కొట్టేసిన తొలి తెలంగాణ షార్ట్‌ఫిల్మ్ - MicTv.in - Telugu News
mictv telugu

కోటి వ్యూస్ కొట్టేసిన తొలి తెలంగాణ షార్ట్‌ఫిల్మ్

February 19, 2018

కలలు కనండి.. దానికొక షార్ట్‌రూట్ ఎంచుకోండి.. మస్తు షార్ట్‌ఫిల్మ్ తియ్యండి వెండితెరకు మీ రంగుల కలలను అప్లై చేసుకోండి.. యూట్యూబ్ ఇప్పుడొక మంచి వేదిక.. అంటున్నాడు తెలంగాణ పిలగాడు, యువ షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు యం.ఎస్. విష్ణు. ఇతను తీసిన ‘ఎక్స్‌ప్రెస్ లవ్’ షార్ట్‌ఫిల్మ్ కోటి వ్యూస్ దాటింది. పొట్టి సినిమాకు ఈ తరహా ఆదరణ అనేది సంచలనమే. యూట్యూబ్ వేదికగా ఈ షార్ట్‌ఫిల్మ్ పది మిలయన్ల పైబడి వీక్షకులను అలరించింది. ఇది ఒక రకంగా పెద్ద సినిమా థియేటర్లో వందరోజులు కాదు ఐదు వందల రోజులు నడిచినదానితో సమానం. అందరూ కుర్రాళ్ళే.. భవిష్యత్తు మీద కోటి ఆశలతో సినిమా రంగానికి వచ్చి కృష్ణానగర్, ఇంద్రానగర్‌లలో ఆపసోపాలు పడుతున్నవారే. కలిసి ఓ షార్ట్‌ఫిల్మ్ తీద్దామనుకున్నారు. తీసి హిట్టు కొట్టారు. 2016లో ఈ షార్ట్‌ఫిల్మ్‌‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

ఏడాది వ్యవధిలోనే ఈ సినిమా ఊహించనంత విజయవంతమైంది. తెలంగాణ షార్ట్‌ఫిల్మ్ చరిత్రలోనే ఇన్ని వ్యూస్ సొంతం చేసుకున్న తొట్టతొలుత షార్ట్‌ఫిల్మ్ ఇదే. పాటలకు, ఏవైనా సినిమా సీన్లు, గాసిప్ వార్తలు ట్రెండింగ్ స్థాయి నుంచి కోటి వ్యూస్ దాటుండొచ్చు.. కానీ ఒక షార్ట్‌ఫిల్మ్ ఇన్ని వ్యూస్ సొంతం చేసుకోవటం నిజంగా గర్వించదగ్గ విషయమే. ఎక్స్‌ప్రెస్ లవ్ తర్వాత విష్ణు ఈ సినిమాకు కొనసాగింపుగా 2017లో ‘ ఎక్స్‌ప్రెస్ లవ్ 2 ’ తీశాడు.  ‘భవిష్యత్తులో విష్ణు గొప్ప దర్శకుడు అవుతాడు. నా సహకారం తమ్ముడికి ఎల్లవేళలా వుంటుంది ’ అని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సినివారంలో అభినందించారు. సన్మానం కూడా చేశారు.

దర్శకుడు యం.ఎస్.విష్ణు :

కురుచగా వున్నాడని తక్కువ అంచనా వేయొద్దు ఈ పిల్లగాణ్ణి. 27 ఏళ్ళ వయసున్న ఇతని ఆలోచనలు చాలా భిన్నంగా వుంటాయి. మహబూబ్ నగర్, మాగనూర్ గ్రామానికి చెందిన విష్ణు గతంలో నందిని, ఆయిలు-ఆవాలు-ఐలవ్యూ, హలో అమ్మాయి వంటి మూడు షార్ట్‌ఫిల్ములు తీశాడు. తర్వాత ఇంకేదైనా యూత్‌కు కనెక్టయ్యే సబ్జెక్ట్ తీద్దామనుకొని ఎక్స్‌ప్రెస్ లవ్‌కు శ్రీకారం చుట్టాడు. కేవలం ఎనిమిది వేల రూపాయలతో ఈ పది నిమిషాల చిత్రాన్ని తీశాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. భవిష్యత్తులో మంచి దర్శకుడిగా ఎదిగి, తెలుగు సినీ రంగానికి తనవంతు సేవలు చెయ్యాలని ఆశిస్తున్నాడు విష్ణు.

ఎక్స్‌ప్రెస్ లవ్ :

ఈ సినిమాలో కథంటూ పెద్దగా ఏమీ వుండదు. ఈ సినిమా చూసినవాళ్ళు హ్యాప్పీగా ఫీలయ్యేలా తీశాడు దర్శకుడు. ఒకమ్మాయిని హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ ట్రెయిన్‌లో చూస్తాడు అబ్బాయి. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని ఫీల్ అవుతారు. ట్రెయిన్ దిగిన అమ్మాయిని అబ్బాయి వెంబడిస్తే అప్పుడా అమ్మాయి నవ్వితే నచ్చినట్టేనా.. అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇతను ఆ అమ్మాయితో గడిపిన ఆ కొన్ని క్షణాలను మననం చేసుకుంటేనే ఈ ఫీల్ బాగుందని ఫీలవుతాడు. ఇంతే ఈ సినిమా కథ. కానీ చూసినవారు ఫీల్ అవుతారు.  

దీని నిర్మాణానికి విష్ణు తన మిత్రులను ఇందులో భాగస్వామ్యం చేసుకొని ఒక్కక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు. ఓ క్యూట్ లవ్‌స్టోరీని తీసి ఆకట్టుకున్నాడు. ఈ పొట్టి సినిమాకు సత్య బెజవాడ నిర్మాతగా ముందుకొచ్చారు. కెమెరా, ఎడిటింగ్ విష్ణు స్నేహితుడు రాజేష్ బొల్లు చేశాడు. సంగీతం నర్సింహ తోటపల్లి అందించగా, జాన్సీ రాథోడ్, సంతోష్ ఖుషీలు హీరో హీరోయిన్లుగా నటించారు.