శ్రీదేవి కూతుళ్లకు సవతి బిడ్డల అండ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి కూతుళ్లకు సవతి బిడ్డల అండ

March 5, 2018

పెళ్లికి కాకపోయినా చావుకైనా కలుసుకోవాలని పెద్దలు చెబుతారు. ఎప్పటికీ ఎడతెగని పగలు, పట్టుదలలు ఆ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తప్పకుండా సానుకూలమవుతాయని అంటారు. అది అక్షరాలా నిజం అయింది దివంగత నటి శ్రీదేవి ఇంట. ఒకరి మరణం ఇంకొకరికి కనువిప్పు అవుతుంది. తల్లి చనిపోయి దుఖ్ఖంలో కూరుకుపోయిన శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ, ఖుషీలకు అన్న అర్జున్ కపూర్, అక్క అన్షులా కపూర్‌లు అండగా నిలబడుతున్నారు. శ్రీదేవి బతికుండగా దూరంగా వున్న సవతి పిల్లలు అర్జున్, అన్షూలు చెళ్ళెళ్ళకు, నాన్నకు తోడుగా వుంటూ వారికి ఊరటనిస్తున్నారు.కొన్నాళ్ళ క్రితం అర్జున్ కపూర్ వాళ్ల తల్లి కూడా చనిపోయింది. నలుగురూ తల్లులు లేని బిడ్డలయ్యారు. తండ్రి ఒంటరిగా ఫీలవుతున్నాడు. ఈ క్రమంలో వారికి వారే గొప్ప ఓదార్పులవుతున్నారు. ఇదిలా ఉంటే అన్షులా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ఉంచింది. బాధలో ఉన్న జాన్వీ-ఖుషీలు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షతో ఆమె ఆ పోస్టును ఉంచింది. దానికి చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నెగెటివ్‌గా స్పందించాడు. జాన్వీ, ఖుషీలపై అసభ్య పదజాలంతో కామెంట్లు పోస్ట్‌ చేశాడు. 

దీనిపై అతగాడి మీద మండి పడింది అన్షులా. నా చెల్లెళ్ల గురించి అలా మాట్లాడితే బాగోదని వార్నింగ్‌ ఇచ్చేసింది. తర్వాత శాంతించి ఇంకొక పోస్ట్ పెట్టింది. ‘ నన్నూ, నా సోదరుణ్ణి అభిమానించిన మీ అందరికీ ధన్యవాదాలు. కానీ నా చెళ్ళెళ్లను అలా అవమానించటం సరికాదు. అందుకే మీ కామెంట్లను నేను తొలగిస్తున్నా. ముందు ముందు ఇలాంటి కామెంట్లు చేసి మనసును బాధ పెట్టొద్దు ’ అని వివరించింది.