అధ్యాపకుల అరాచకంతో విద్యార్థిని బలి - MicTv.in - Telugu News
mictv telugu

అధ్యాపకుల అరాచకంతో విద్యార్థిని బలి

November 23, 2017

సదువుల సంత మరో విద్యర్థినిని బలి తీసుకుంది. ఇంటర్నల్ ఎగ్జామ్‌లో కాపీ కొట్టిందని  పది మందిలో పరువు తీయడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. 18 ఏండ్లు కూడా లేని ఆ విద్యార్థిని తన బంగారు భవిష్యత్తుకు ముగింపు పలికింది.  చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో మౌనిక బీటెక్‌ సీఎస్‌ఈ ఫస్టియర్‌ చదువుతున్నది. పరీక్షల సందర్భంగా అధ్యాపకుల తీరుతో తెలుగు విద్యార్థిని మౌనిక తీవ్రంగా కలత చెందింది. తప్పు చేస్తే మందలించడానికి చాలా మార్గాలున్నాయి. కానీ వాళ్ళు తోటి విద్యార్థుల ముందే తనను నానా మాటలు అని పరీక్ష హాల్ నుండి తరిమేశారు. తదుపరి పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మౌనిక అందరిలో తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక పోయింది. ‘ ఇన్ని రోజులూ ఎంతో కష్టపడి చదువుకున్న తాను చిన్న పొరపాటు చేసి దొరికిపోయి, అందరిలో అవమానాన్ని ఎదుర్కున్నాను ’ అనుకుందేమో పాపం మౌనిక ఆత్మహత్యకు పూనుకున్నది. ‘  మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ ’ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మౌనిక మరణంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు. అధ్యాపకుల తీరుపై విద్యార్థులంతా మండి పడుతున్నారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు జనవరి 2 వరకు సెలవులు ప్రకటించింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తం అయేట్టున్నాయని హాస్టళ్ళలో వున్న విద్యార్థులను ఇళ్ళకి పంపించేసింది. యూనివర్సిటీ మొత్తంగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఎంతో భవిష్యత్తున్న తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. వారి కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ‘ తన కూతురిని బలిగొన్నది యూనివర్సిటీ యాజమాన్యమే ’ అని మౌనిక తండ్రి రాజారెడ్డి ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన కూతురు తప్పు చేస్తే పక్కకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ చేసుంటే సరిపోయేది. తను చాలా సెన్సిటివ్. తన మనసుకు ఎంత బాధ కలిగితే ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని అన్నారు. గురువారం మధ్యాహ్నం మౌనిక మృతదేహానికి రాయపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం జరగనుంది.