ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలె   - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలె  

December 4, 2017

‘ విద్యార్థుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. దేశంలో 18 నుండి 35 ఏళ్ల నిరుద్యోగులు 67 శాతం మంది ఉన్నారు. కొట్లాడి కొలువులు, కొట్లాడి తెలంగాణ, కోట్లాది రాజకీయం తెచ్చుకున్నాం.తెలంగాణలో ఫ్యూడల్  రాజ్యం నడుస్తోంది. దొరలు అంటే కేవలం  వెలమలు మాత్రమే కాదు… భూస్వాములను కూడా దొరలు అంటాం.

గ్రామాల్లో కూడా జేఏసి ఏర్పాటు చేయాలి. శాంతియుతంగా ఉద్యమాలు చేయాలి. విద్యార్థులు  రాజకీయ శక్తిగా ఎదగాలి. నేను 2002 లో రాసిన పాటకు  తెలంగాణ వచ్చిన రెండు రోజులకే ఆసిఫాబాద్‌లో నా చేతులకు బేడీలు వేశారు పోలీసులు ’ అంటూ టీజేఏసీ చేపట్టిన ‘ కొలువుల కొట్లాట ’ సభలో ప్రొ. కోదండరాం మాట్లాడారు.

ఓయూలో పోలీసుల లాఠీఛార్జీల‌ను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. నిర్బంధాల‌తో నిర‌స‌న‌ల‌ను ఆడ్డుకోలేరని అన్నారు. సభకు వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్ట్‌లను టీజేఏసీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు.  సభకు రాకుండా ప్రభుత్వం ఇబ్బందులు , ఆటంకాలు  కల్పిస్తుందని, విభేదాలు పక్కన పెట్టి అన్ని పక్షాలు ఐక్యమత్యంతో సభను విజయవంతం చేయాలని  ఆయన కోరారు.

మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ  ప్రభుత్వంకు ఒక సందేశం పంపాలని, వారికి మన సత్తా చాటి కనువిప్పు అయ్యే విధంగా సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ స‌భకు తెలంగాణ‌లోని అన్నీ జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త హాజ‌రైంది. స‌భ జ‌రుగుతున్న స‌రూర్‌న‌గ‌ర్ ఇండోర్‌ స్టేడియం వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును భారీగా ఏర్పాటు చేశారు. 


స‌భ‌లో టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, చాడ వెంక‌ట్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రరావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, టీడీపీ నేత ఎల్‌.రమణ, ప్ర‌జా గాయ‌కురాలు విమ‌ల‌క్క తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వ‌చ్చి మూడున్న‌రేళ్లు అయిపోయిన‌ప్ప‌టికీ ఉద్యోగ నియామ‌కాలు లేవంటూ నిరుద్యోగులు రాష్ట్ర స‌ర్కారుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు  చేశారు.