శబరిమలలో హిజ్రాకు చుక్కెదురు - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలలో హిజ్రాకు చుక్కెదురు

December 15, 2017

‘మతాచారాలకు ఎవరూ అతీతం కాదు, 10 నుండి 50 సంవత్సరాల మహిళలు అయ్యప్ప దర్శనానికి రాకూడదు..  అందుకు ట్రాస్స్‌జెండర్లు కూడా అతీతం కాదు’ అని  శబరిమల అధికారులు తేల్చి చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన మోహన్( 30 ) అనే ట్రాన్స్‌జెండర్ 41 రోజుల దీక్ష అయ్యప్ప దీక్ష చేశాడు. గురువారం సాయంత్రం అయ్యప్ప దర్శనానికి వచ్చాడు. అయితే పోలీసులు అడ్డుకుని లోపలికి వెళ్ళనివ్వలేదు.

తనకు రుతుస్రావం ఉండదని, లింగమార్పిడి చేయించుకున్నానని అతడు ఆస్పత్రి  డాక్యుమెంట్లను వారి ముందుంచాడు. అవన్నీ పరిశీలించిన అధికారులు అవి తప్పుల తడకలా ఉన్నాయని  తేల్చి చెప్పారు. సన్నిధానం నుంచి పోలీసులు మోహన్‌ను పంబకు తీసుకు వెళ్లారు. శబరిమల నియమాలను ధిక్కరించరాదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్‌ తెలిపారు. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలపై ఈ గుడిలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.కాగా, తనకు ప్రవేశం నిరాకరించడంపై మోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేవుడి ముందు మనుషులందరూ సమానమేని, తనపై వివక్ష చూపడం దారుణమని అంటున్నాడు. ‘నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను.. నేను ఎంతో నియమనిష్టలతో దీక్ష చేశాను.. పొద్దునే చలినీళ్లు పోసుకున్నాడు.. అయ్యప్ప ధ్యాస తప్ప మరొకటి లేదు.. అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తే దేవుడిని చూడకుండా ఇలా గెంటెయ్యడం ఏం న్యాయం?’ అని ప్రశ్నిస్తున్నాడు.

హిజ్రాలపై దేవుడు వివక్ష చూపడని అంటున్నాడు. సాక్షాత్తూ అయ్యప్ప కూడా స్త్రీ కాని, పురుషుడు కాని మోహినికి జన్మించాడని, అలాంటి స్వామి తనను ఎప్పటికైనా కరుణిస్తాడని ఓ తమిళ చానల్‌కు చెప్పాడు.