ఆమెగా మారాడని ఇంటికి పంపారు..

లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నందుకు విశాఖపట్నంలోని భారత నౌకాదళ సెయిలర్‌గా  పనిచేస్తున్న మనీష్‌ కుమార్‌ గిరి అలియాస్‌ సబి గిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. లింగమార్పడి  నేవీ నిబంధనలకు వ్యతిరేకమని భావిస్తున్నారు. నేవీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయించుకున్నందుకు సబిగిరిపై వేటు పడినట్టు తెలుస్తోంది. తన ఇష్ట ప్రకారమే తను ఈ పని చేసినా నౌకాదళ నిబంధనల ప్రకారం కుమార్‌ను ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని నేవీ పేర్కొంది. నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత త్రివిధ దళాల్లోకి మహిళలను సైతం తీసుకోవాలని, యుద్ధశిక్షణ రంగంలో వారిని నియమించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రతికూలమైందనే విమర్శలు వినబడుతున్నాయి.

ఏడేళ్ల కిందట విశాఖపట్నంలో నేవీ సెయిలర్‌గా చేరిన మనీష్‌ కుమార్‌ గిరి కొన్ని నెలల కిందట 22 రోజుల సెలవు తీసుకున్నాడు. ఈ సమయంలో అతడు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొని సబీగా మారాడు. అనంతరం ఉద్యోగంలో తిరిగి చేరిన అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అధికారులు ఈ విషయం గుర్తించారు. వెంటనే అతణ్ణి నేవీ నుండి తీసి వేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా సబీగిరి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఉద్యోగంలోనుంచి తొలగించాలన్న నేవీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తన శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను ఉద్యోగానికి అన్‌ఫిట్ అని ముద్ర వేసి విధుల్లోంచి తొలగించడం అస్సలు బాగోలేదని అన్నది. ఈ విషయమై న్యాయం కోసం తను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతానని చెప్పింది.

SHARE