మైనారిటీ యువతకు 2.5 లక్షల రుణాలు - MicTv.in - Telugu News
mictv telugu

మైనారిటీ యువతకు 2.5 లక్షల రుణాలు

October 23, 2017

తెలంగాణ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని  ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మైనారిటీలు అన్నీ రంగాల్లో ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం సాయశక్తులా పని చేస్తుందని.. రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలలో మైనారిటీల ఎదుగుదల కూడా ఒకటని అన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలు తప్పక లబ్ది పొందేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీపై లక్ష నుంచి రెండున్నర లక్షల రూపాయల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సహాయం అందించాలని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మైనారిటీలకు తప్పకుండా కనీసం పదిశాతం కోటా ఉండాలని ఆదేశించారు. మైనారిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఉర్థూ అకాడమీ, వక్ఫ్ బోర్డులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మైనారిటీల సంక్షేమంపై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు కేటిఆర్ , ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీల కోసం ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

‘ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మైనారిటీల్లో ముస్లింలే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీల్లో అత్యంత పేదరికం ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే మైనారిటీల జీవితంలో వెలుగు వస్తుందని నేను ఉద్యమ సమయంలోనే అనేక మార్లు చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. చాలా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల  నిధులు ఎలా ఖర్చు చేస్తున్నామో మైనారిటీల కోసం పెట్టే ఖర్చును కూడా అలాగే ఖర్చు చేయాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ది చెందితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ఒక్క వర్గం వెనుకబడిపోయినా అది సంపూర్ణ ప్రగతి కాదు ’ అని ముఖ్యమంత్రి అన్నారు.

సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు :

– ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో కచ్చితంగా మైనారిటీలు లబ్ది పొందే విధంగా కార్యాచరణ ఉండాలి.

– పేద మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలి. లక్ష, రెండు లక్షలు, రెండున్నర లక్షల రూపాయల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సహాయం అందించాలి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి

– డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో పదిశాతం మైనారిటీలకు దక్కేలా చర్యలు తీసుకోవాలి.

– అర్బన్, సెమీ అర్బన్, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలి.

పాఠశాలలు, కళాశాలల్లో ఉర్ధూ టీచర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఖాళీలున్నాయి? ఇంకా ఎన్ని కావాలి? తదితర వివరాలు సేకరించి భర్తీ చేయాలి.

– మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఉర్థూ అకాడమీ, వక్ఫ్ బోర్డు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

– రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ లు ఇంగ్లీషు, తెలుగుతో పాటు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలి.

– హైదరాబాద్ నగర పరిధిలో ముస్లింల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడను, ప్రత్యేక ఐటి కారిడార్ ను అభివృద్ధి చేయాలి.

– కోకాపేటలో పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలి. మూడు వారాల్లోగా నిర్మాణ పనులు కావాలి.

– దేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కు వచ్చే ప్రతీ పర్యాటకుడు చార్మినార్ చూడాలనుకుంటారు. దీనికి తగినట్లుగా చార్మినార్ వద్ద ఏర్పాట్లుండాలి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. పర్యాటకులు చార్మినార్ వద్ద సులభంగా గడపడం కోసం ఏర్పాట్లు చేయాలి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలి.

– 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతాన్ని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలి. పార్కులు, షాపింగ్        కాంప్లెక్స్‌లతో పాటు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా నిర్మించాలి. మూసీ నది వెంట మెట్రోరైలు / నానో రైలు నడపడానికి ఏర్పాట్లు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలి.

– హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివిధ అత్యవసర పనులు చేయడం కోసం ఎస్.డి.ఎఫ్. నుంచి రూ.40 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

రెసిడెన్షియల్ స్కూళ్లు ఓ విప్లవం : అసదుద్దీన్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మైనారిటీ సంక్షేమంపై జరిగిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దీన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. బోధన, వసతి, ఆహారం బాగున్నాయని ప్రశంసించారు. మైనారిటీ సంక్షేమం కోసం అన్ని రకాల వ్యయాల కన్నా, రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం పెట్టే ఖర్చు తనకు ఎంతో తృప్తినిస్తున్నదని సీఎం అన్నారు. రేపటి తరానికి మంచి విద్యను అందించడం కన్నా మించిన ఆస్తి ఏదీ లేదని సీఎం చెప్పారు. తమకు సెక్షన్లు పెంచమని, అదనపు స్కూళ్లు కావాలని ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తున్నదన్నారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జామీయా నిజామియా యాజమాన్యం :

జామీయా నిజామియా విద్యాలయం నుంచి ఇచ్చే డిగ్రీ సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించిన ముఖ్యమంత్రికి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఎమ్మెల్యే పాషా ఖాద్రి, వొలేమా కమిటీ చైర్మన్ బాద్షా ఖాద్రి, చాన్స్‌లర్ అక్బర్ నిజాముద్దీన్, వైస్ చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.