భార్య అనుమతి లేకుండా శృంగారం చేయొచ్చు.. గుజరాత్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య అనుమతి లేకుండా శృంగారం చేయొచ్చు.. గుజరాత్ హైకోర్టు

April 3, 2018

గుజరాత్ హైకోర్ట్ సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని స్పష్టం చేసింది. ఇన్ని రోజులూ భార్య అనుమతి లేకుండా బలవంతంగా భర్త శృంగారం జరిపితే అది అత్యాచారమేనంటూ గతంలో పలు కోర్టులు తీర్పులిచ్చిన విషయం తెలిసిందే. వాటికి భిన్నంగా గుజరాత్ హైకోర్ట్ అభిప్రాయాలు వ్యక్తం చేయటం విస్మయానికి గురి చేస్తోంది. భార్య అనుమతి లేకుండా భర్త శృంగారం చేయొచ్చు కానీ నోటి ద్వారా గానీ, ఇతర అసహజ మార్గాల్లో భాగస్వామితో శృంగారం కోరుకుంటే అది క్రూరత్వంతో సమానం అని పేర్కొంది. ‘ ఓ వ్యక్తికి జంతువుకు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే, అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యల వంటివే విపరీత శృంగారాలు. మిగతావి ఏవీ ఐపీసీలోని సెక్షన్ 377 కిందకు రావు ’ అని  హైకోర్టు తెలిపింది. తన భర్త తనపై అత్యాచారం చేయడమే గాక, హింసించాడంటూ ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘ నా భర్త నా ఇష్టానికి వ్యతిరేకంగా ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేస్తున్నాడు. నా ఇష్టంతో ఆస్కారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు శృంగారం కావాలంటున్నాడు ’ అని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఆమె ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్ధీవాలా చెప్పారు. అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు.